Nasu Dengaku Recipe । మీకు గ్రిల్ చేసిన వంటకాలు ఇష్టమా.. ఇలా కాల్చుకు తింటే కమ్మగా ఉంటుంది!
Nasu Dengaku Recipe: కొత్తకొత్త రుచులు కోరుకునే వారి కోసం ఒక కమ్మని వంటకం పరిచయం చేస్తున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన రెసిపీ ఉంది, ఇది వండుకొని చూడండి.
తాజా కూరగాయల్లో రాజా ఏదంటే వంకాయ అని చెబుతారు. వంకాయను ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఎలా వండుకున్నా కూడా ఇది రుచిగానే ఉంటుంది. శాకాహార విందు భోజనంలో గుత్తి వంకాయ కూర కచ్చితంగా ఉంటుంది. బగారా అన్నంతో తినే బగారా వంకాయ కూర టేస్టే వేరు. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా వంకాయను వండుకోవచ్చు. మీకు ఇప్పుడు వంకాయతో వండే ఒక పాపులర్ రెసిపీని పరిచయం చేస్తున్నాం.
డెంగాకు, సంగాకు, సరుగాకు అనేవి పురాతనమైన జపానీస్ జానపద నృత్య కళారూపాలనుంచి తీసుకున్న పదాలు. ఈ నాసు డెంగాకు కూడా జపనీస్ పురాతనమైన సాంప్రదాయ వంటకం. దీనినే Miso Glazed Eggplant అని కూడా అంటారు. అక్షరాలా నిప్పు మీద కాల్చిన వంకాయ అని అర్థం. ఈ రకంగా వండిన వంకాయ ఎంతో రుచిగా, స్మోకీగా, కొంచెం తీపిగా, మసాలా ఫ్లేవర్లను కలిగి ఉంటుంది. మీరు తినాలనుకుంటే నాసు డెంగాకు రెసిపీ ఇక్కడ ఉంది, సూచనలు చదివి చేసేయండి.
Nasu Dengaku Recipe కోసం కావలసినవి
- 2-3 వంకాయలు (ఊదారంగువి)
- 2 టేబుల్ స్పూన్లు వెజిటెబుల్ ఆయిల్
- 1/4 కప్పు మిసో పేస్ట్ (పులియబెట్టిన సోయా బీన్ పేస్ట్)
- 2 టేబుల్ స్పూన్లు మిరిన్ ( పులియబెట్టిన తియ్యటి రైస్ గంజి)
- 1 టేబుల్ స్పూన్ చక్కెర
- 1 టీస్పూన్ నువ్వులు
- 1 స్ప్రింగ్ ఆనియన్
నాసు డెంగాకు తయారీ విధానం
- ముందుగా వంకాయను నిలువుగా సగానికి కోసి రెండు ముక్కలు చేయాలి. ఆపై కత్తిని ఉపయోగించి, వంకాయ లోపలి భాగానికి అర అంగుళం మేర చతురస్రాకారమైన గాట్లు పెట్టాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేసి, అధిక వేడి మీద వంకాయలను గాట్లు పెట్టుకున్న వైపు కాల్చండి, గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి.
- అనంతరం వంకాయలను తిరగేసి మూతపెట్టి సుమారు 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి.
- ఈలోపు ఒక గిన్నెలో, మిసో సాస్, మిరిన్, చక్కెర, స్ప్రింగ్ ఆనియన్ కలపాలి. దీనినే డెంగాకు మిశ్రమం అంటారు.
- ఇప్పుడు ఈ డెంగాకు మిశ్రమాన్ని నూనెలో వేయించిన వంకాయలకు పూయాలి.
- ఆపైన ఈ వంకాయలను ఓవెన్‌లో ఉంచి 4 నిమిషాలు కాల్చాలి లేదా పెనంపై కాల్చుకోవచ్చు లేదా నేరుగా మంటకు కాల్చవచ్చు.
- చివరగా పెనంపై వేగించిన నువ్వులను చల్లాలి. మీరు కావాలంటే రుచి కోసం కొంచెం ఉప్పు చల్లుకోవచ్చు.
అంతే నాసు డెంగాకు రెడీ. వేడివేడిగా అన్నంలో పప్పుతో కలుపుకొని లేదా నేరుగా తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం