Tandoori Fish Recipe । మీ వారంతపు విందు కోసం పసందైన వంటకం.. తందూరీ ఫిష్!
Tandoori Fish Recipe: తందూరీ ఫిష్ మీ వీకెండ్ విందుకు పసందైన వంటకం. సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
చేపలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్, మటన్ లాంటి మాంసాహారాలు తినడానికి ఇష్టపడని వారు కూడా చేపలు తినేందుకు ఇష్టపడతారు. మీ వీకెండ్ విందును మరింత పసందైన రుచులతో ఆస్వాదించాలనుకుంటే, చేపలతో కూడా అద్భుతమైన వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. చాలా సులభంగా, త్వరగా చేసుకోగలిగే రెసిపీని ఇప్పుడు తెలుసుకుందాం.
నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో రుచికరంగా ఏదైనా వండాలనుకుంటే తందూరీ వంటకాలను ప్రయత్నించవచ్చు. ఇందులో తందూరీ ఫిష్ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. రుచికరంగా తందూరీ ఫిష్ చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి. చేపల కూర చేసుకునేటపుడు కొన్ని పులుసు పెట్టుకుంటే కొన్ని ఫ్రై చేసుకుంటారు. ఒకసారి ఇలా తందూరీ కూడా చేసుకోండి మరి.
Tandoori Fish Recipe కోసం కావలసినవి
- 300 గ్రాముల సాల్మన్ చేప
- 8 వెల్లుల్లి రెబ్బలు
- 1 అంగుళం అల్లం ముక్క
- 1 టేబుల్ స్పూన్ లైమ్ జెస్ట్ (నిమ్మ తురుము)
- 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
- 3 టేబుల్ స్పూన్లు శనగ పిండి
- 2 స్పూన్ల కొత్తిమీర
- 2 టేబుల్ స్పూన్లు నిమ్మ రసం
- 1 టేబుల్ స్పూన్ కారం
- 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి
- 1 కప్పు వెజిటెబుల్ నూనె
- ఉప్పు తగినంత
తందూరీ ఫిష్ తయారు చేసుకునే విధానం
- ముందుగా అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేసుకొని ఒక పక్కనపెట్టండి, అలాగే చేపను శుభ్రం చేసుకొని పక్కనపెట్టుకోండి.
- అనంతరం అర కప్పు వెజిటెబుల్ నూనెలో అల్లంవెల్లుల్లి, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, నిమ్మ తురుము, రుచికోసం ఉప్పు వేసి చక్కటి పేస్ట్ చేయండి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, శనగపిండిని వేసి లేత రంగు వచ్చేవరకు ఒక నిమిషం పాటు ఉడికించాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి.
- ఇప్పుడు మెరినేషన్ కోసం మసాలా పేస్ట్, శనగపిండి మిశ్రమం కలిపి అవసరం అనుకుంటే పెరుగు కూడా కలిపి పేస్ట్ చేసుకోవాలి.
- సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించి ఒక గంట పాటు మెరినేట్ చేయండి.
- చివరగా, మెరినేట్ చేసిన చేపలను బేకింగ్ డిష్‌లో వేసి , ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి బేక్ చేయండి. లేదా 10-15 నిమిషాలు సన్నని మంటకు కాల్చండి.
అంతే, తందూరీ ఫిష్ రెడీ. . చట్నీ లేదా సాస్‌తో వేడివేడిగా వడ్డించుకోండి.
సంబంధిత కథనం