Ginger Chicken Curry । ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే జింజర్ చికెన్ కర్రీ, అదిరిపోయే రుచి మరి!
Ginger Chicken Curry Recipe: ఉల్లిపాయలు అల్లం మిశ్రమంలో ఘాటుగా ఇలా చికెన్ కర్రీ ఎప్పుడూ చేసుకొని ఉండరు. జింజర్ చికెన్ కర్రీ రెసిపీ ఇక్కడ ఉంది ఓసారి ప్రయత్నించి చూడండి.
ఆదివారం రోజున కోడికూర చేసుకుంటున్నారా? ఎప్పుడూ చేసుకునే విధానంలో కాకుండా పూర్తి భిన్నంగా, మరెంతో రుచికరంగా ఉండే జింజర్ చికెన్ కర్రీని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వంటకంలో అసలైన రుచిని ఇచ్చేది దీని గ్రేవీ. జింజర్ ఫ్లేవర్‌తో కూడిన రుచికరమైన గ్రేవీ ఘాటుగా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. దీనిని మీరు అన్నంతో లేదా ఏదైనా రొట్టెతో కలుపుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. ఇది తింటే దగ్గు, జలుబు, ఫ్లూలు కూడా ఇట్టే మటుమాయమయిపోతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
మీరు ఇలాంటి కోడికూరను ఎప్పుడూ రుచి చూసి ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి తిని చూస్తే దీని గ్రేవీ రుచికి మీరు ప్రేమలో పడతారు. ఇలాంటి చికన్ కర్రీ బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలలో చాలా ప్రసిద్ధి.
జింజర్ చికెన్ కర్రీ కోసం చేసే గ్రేవీలో ప్రధానంగా ఉల్లిపాయ, బోలెడంత అల్లం, ఇంకా వెల్లుల్లితో పాటు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి. ఈ మిశ్రమంలో ఉడికిన చికెన్ వేడివేడిగా తింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈ కోడికూర తయారీకి కావాలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి. జింజర్ చికెన్ కర్రీ రెసిపీని ఈ కింద చూడండి.
Ginger Chicken Curry Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల చికెన్
- 1/4 కప్పు నూనె
- 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్
- 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్
- 1/2-1 టేబుల్ స్పూన్ సోయా సాస్
- 2 టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్
- 1 స్పూన్ వెనిగర్
- 1-2 టేబుల్ స్పూన్లు కారంపొడి
- 1 కప్పు వేడి నీరు
- 1/2 స్పూన్ చక్కెర
- ఉప్పు రుచికి తగినంత
- కొత్తిమీర గార్నిషింగ్ కోసం
మసాలా కోసం
- 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు
- 1/4 కప్పు తాజా అల్లం
- 8-10 వెల్లుల్లి రెబ్బలు
జింజర్ చికెన్ కర్రీ తయారీ విధానం
- ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకొని ఆపైన ఆ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అల్లం, వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మీడియం మంట మీద బాణలిలో నూనె వేడి చేయండి. అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి, రంగు లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం తురుము వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, సోయా సాస్, వెనిగర్, కారం పొడి వేసి బాగా కలపండి, 1-2 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి మసాలాతో బాగా కలపాలి. 5 నిమిషాలు వేయించాలి.
- అనంతరం ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వండి.
- చికెన్ గ్రేవీకి సరిపడా వేడి నీటిని వేసి బాగా కలపాలి. ఇందులోనే కొంచెం చక్కెర వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు పాన్‌ను మూతపెట్టి 20 నిమిషాలు లేదా చికెన్ ఉడికేంత వరకు తక్కువ మంట మీద ఉడికించండి.
- గ్రేవీ చిక్కగా, నూనె విడిపోయే వరకు తక్కువ మంటపై ఉడికించండి.
చివరగా స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే జింజర్ చికెన్ కర్రీ రెడీ.. ఇక కుమ్మేయండి!
సంబంధిత కథనం