Hyderabadi Chicken Fry Recipe | స్పైసీగా.. జ్యూసీగా హైదరాబాదీ కోడికూర ఫ్రై!-indulge in the taste of spicy juicy hyderabadi chicken fry recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hyderabadi Chicken Fry Recipe | స్పైసీగా.. జ్యూసీగా హైదరాబాదీ కోడికూర ఫ్రై!

Hyderabadi Chicken Fry Recipe | స్పైసీగా.. జ్యూసీగా హైదరాబాదీ కోడికూర ఫ్రై!

HT Telugu Desk HT Telugu

సువాసనభరితమైన బగారా అన్నంలో సుగంధాల మసాలాలతో తయారుచేసుకునే స్పైసీ, జ్యూసీ హైదరాబాదీ చికెన్ ఫ్రై తింటుంటే ఈ జన్మకు ఇది చాలు అన్నంత తృప్తిగా ఉంటుంది. టేస్టీగా, ఈజీగా ఇలా చేసుకోండి.

Chicken Fry - Hyderabad Style (Unsplash)

కోడికూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? బాగా కండపట్టిని చికెన్ లెగ్ పీస్ ని అక్కడక్కడా గాట్లు పెట్టి, మంచిగా మసాలా కారం దట్టించి, సన్నని సెగమీద నూనెలో వేయిస్తే వచ్చే ఆ సువాసనకే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. నాన్- వెజ్ తినననివారికి కూడా నోరు ఊరుతుంది. ఇక, మన హైదరాబాదీ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అందరూ దాని రుచి మరిగే ఉంటారు. మరి హైదరాబాదీ చికెన్ ఫ్రై తిన్నారా? బిర్యానీ ఉండగా మనం మిగతా రుచులను ఎక్కువగా పట్టించుకోము. కానీ, హైదరాబాదీ చికెన్ ఫ్రై కూడా ఆహా అనేలా ఉంటుంది.

మీరు ఆదివారం లేదా మరేదైనా సెలవు దినం రోజున విందు చేసుకోవాలనుకుంటే ఈ క్లాసిక్ హైదరాబాదీ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ఈ వంటకం తయారీకి అవసరమయ్యే పదార్థాలు తక్కువే, తయారు చేసుకోవటం కూడా చాలా సులభం , త్వరగా చేసేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది.

జ్యుసి చికెన్ ముక్కలను సువాసనగల మసాలాల మిశ్రమంలో మెరినేట్ చేసి దగ్గరకు వండుకుంటే కొసరికొసరి తినాలనిపిస్తుంది. స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్ తాగేటపుడు మంచింగ్ లా తీసుకుంటే మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇంకా ఎంతసేపు ఇలా వర్ణించడం.. వెంటనే రెసిపీలోకి వెళ్లిపోదాం.

Hyderabadi Chicken Fry Recipeకి కావలసినవి

  • 1/2 కిలో చికెన్
  • 3 టేబుల్ స్పూన్ల పెరుగు
  • 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
  • 1/2 కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 స్పూన్ల కారం
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1 టీస్పూన్ జీరా పౌడర్
  • 1 స్పూన్ ఫెన్నెల్ పౌడర్
  • 1 స్పూన్ ధనియాల పొడి
  • 1/2 స్పూన్ నల్లమిరియాలు
  • 2 పచ్చిమిర్చి
  • 6-7 కరివేపాకు
  • తరిగిన కొత్తిమీర
  • 1 దాల్చిన చెక్క
  • 2-3 ఏలకులు
  • 2-3 లవంగాలు
  • 2-3 టేబుల్ స్పూన్ నూనె
  • ఉప్పు రుచికి తగినట్లుగా

హైదరాబాదీ చికెన్ ఫ్రై తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో అన్ని కారం, ఉప్పు సహా అన్ని మసాల పొడులు వేయండి.
  2. ఆ తర్వాత పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకు, కొత్తిమీర రెమ్మలు వేయండి.
  3. ఆపై దోరగా నూనెలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అన్ని పదార్థాలు కలిసిపోయేలా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు పక్కనబెట్టి మెరినేట్ కానివ్వండి.
  4. గంట తర్వాత ఒక పాన్ లో 2-3 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి అందులో తరిగిన పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వేసి కొద్దిగా ఫ్రైచేయండి.
  5. అనంతరం మెరినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక 5 నిమిషాలు ఎక్కువ వేడి మీద వేడి చేయండి. చికెన్ కొంత నీరు లాగా మారిన తర్వాత మూతపెట్టి తక్కువ ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించండి.

ఆ తర్వాత మూత తీసి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హైదరాబాదీ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. మీ ఇంటి చికెన్ ఫ్రై వాసన, పక్కింటి వాళ్ల నోళ్లను ఊరేలా చేస్తుంది. ఈ హైదరాబాదీ చికెన్ ఫ్రైను రోటీలతో గానీ, పూరీలతో గానీ, అన్నంతో గానీ తినవచ్చు.

సంబంధిత కథనం