Chicken Finger Day | చిన్న బ్రేక్ తీసుకోండి.. చికెన్ ఫింగర్స్ తినేయండి!
నాన్-వెజ్ స్నాక్స్ కోసం చూస్తున్నారా? సులభంగా, త్వరగా చేసుకునే చికెన్ ఫింగర్స్ రెసిపీ ఇక్కడ ఉంది. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఎలాంటి పార్టీ కోసమైనా స్టార్టర్స్ గా ఇవి అద్భుతంగా ఉంటాయి.
మాంసాహార ప్రియులకు మాంసాహారంలో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది చికెన్ తినటానికి ఇష్టపడతారు. చికెన్ తో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. మెయిన్ కోర్స్ పక్కనపెట్టి స్టార్టర్స్ విషయానికి వస్తే.. చికెన్ స్టార్టర్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎలాంటి పార్టీలోనైనా నంజుకోవటాని స్టఫ్ గా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. మీరు వేడివేడిగా ఏవైనా నాన్-వెజ్ స్నాక్స్ కొరకు చూస్తున్నట్లయితే మీకోసం రుచికరమైన చికెన్ ఫింగర్స్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
లేత చికెన్ ముక్కలకు ఉప్పు,కారం, మసాల మంచిగా దట్టించి సలసల మరిగే నూనెలో వేయించుకొని తింటే అద్భుతంగా ఉంటాయి. బయట నుంచి క్రిస్పీగా, లోపలి నుంచి జ్యూసీగా ఆహా అనేలా ఉంటాయి. అన్నట్టూ ఈరోజు చికెన్ ఫింగర్‌ల పుట్టినరోజు కూడా. అంటే ప్రతీ ఏడాది జూలై 27న Chicken Finger Day గా యూఎస్, అలాగే కొన్ని అరబ్ దేశాలలో జరుపుకుంటారు.
సరే, చికెన్ ఫింగర్‌ల తయారీ కోసం కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి.
కావలసినవి
- 5-6 బోన్ లెస్-స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్‌లు
- 1 గుడ్డు
- 1 కప్పు మజ్జిగ
- 1 టీస్పూన్ వెల్లుల్లి పొడి
- 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్
- 1 కప్పు మైదా పిండి
- 1 కప్పు బ్రెడ్ ముక్కల పొడి
- 1/2 టీస్పూన్ సోయా సాస్
- 1/2 టీస్పూన్ కారం
- 1/2 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
- వేయించడానికి నూనె
తయారీ విధానం
- చికెన్‌ను చేతి వేలు పొడవులో స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న చికెన్ స్ట్రిప్స్ తీసుకొని గుడ్డు పగలగొట్టండి, ఆపై మజ్జిగ, వెల్లుల్లి పొడి, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్, సోయాసాస్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా ఒక అర కప్పు నీరు పోసుకోండి. దీనిని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టండి.
- ఇప్పుడు మైదాపిండి, వెల్లుల్లి పొడి, బ్రెడ్ ముక్కల పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. ఫ్రిజ్ లో నుంచి తీసిని చికెన్ స్టిప్స్ ఒకొక్క ముక్కను పిండిలో ముంచండి.
- ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలో పిండిలో ముంచిన చికెన్ స్ట్రిప్స్ ఒక్కొకటి వేసి చికెన్‌ను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి.
అంతే చికెన్ ఫింగర్స్ రెడీ అయినట్లే, వీటిని సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకోండి. టొమాటో సాస్ లో అద్దుకొని ఆస్వాదించవచ్చు.
సంబంధిత కథనం