Cooking Tips । చికెన్ లేదా మటన్ రుచి మరింత పెరగాలంటే.. ఈ చిట్కా పాటించండి!
Cooking Tips Tricks: ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లల్లో మటన్-చికెన్ మసాలాల ఘుమఘుమలు మామూలుగా ఉండదు. అయితే ఇలా వండితే ఇంకా రుచి పెరుగుతుంది.
చాలా మందికి ఇతరులు చేసే వంట నచ్చదు, మీరు ఎంత బాగా వండిపెట్టినా వారికి ఆ ఆహారం రుచించదు. తమ స్వహస్తాలతో తామంతట తామే ఏది చేసుకున్నా వారికి నచ్చుతుంది. వీకెండ్ వచ్చినా, లేదా ఏదైనా సెలవు రోజు దొరికినా తమ పాక నైపుణ్యాలను వెలికి తీస్తారు. తమకు నచ్చిన వంటకాలను వండుకొని విందు చేసుకుంటారు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా తమ వంటకాల రుచిని చూపించి వారి నుంచి ప్రశంసలు ఆశిస్తారు. ఆ వంటకం రుచిని చూసినవారు మొఖం మాడ్చుకున్నా సరే అది బాగుందనే చెప్పాలి.
బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసేవారు వంటలతో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తారు. కొత్తకొత్త వంటకాలను కనుగొంటారు, కొన్ని అద్భుతంగా ఉంటే మరికొన్ని ఫెయిల్ అయిపోతాయి. ఎంతో జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా ఆ వంట చెడిపోతుంది, మీ శ్రమ వృధా అవుతుంది.
Cooking Tips Tricks- కుకింగ్ చిట్కాలు
మీకు ఇక్కడ కొన్ని కుకింగ్ చిట్కాలు తెలియజేస్తున్నాం. వీటిని పాటించడం ద్వారా మీ వంటల్లో రుచి, నాణ్యత పెరుగుతాయి. అవేంటో తెలుసుకోండి మరి.
వంటల్లో ఉప్పును తగ్గించడం
కొన్నిసార్లు అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువ వేసేస్తాం. చప్పగా ఉన్న ఉప్పులేని పప్పుచారును తినవచ్చుగానీ, ఉప్పు ఎక్కువ వేసిన ఏ వంటకాన్ని తినలేం. అలా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. వంటల్లో వేసిన అదనపు ఉప్పును తటస్థీకరించడానికి మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఈ చిట్కా పాటించండి. అందులో కొన్ని పాలు లేదా మలైని వేయండి. ఆ విధంగా ఉప్పు రుచి తగ్గుతుంది. లేదా రెండు మూడు పెద్దని బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించినపుడు కూడా ఉప్పు తగ్గుతుంది. ఈ పదార్థాలు ఉప్పును పీల్చుకుంటాయి.
చికెన్ - మటన్ రుచిని ఎలా పెంచాలి
మీరు చికెన్ లేదా మటన్ తయారు చేయబోతున్నట్లయితే, కనీసం రెండు గంటల పాటు చికెన్- మటన్ ముక్కలను మ్యారినేట్ చేసి ఉంచండి. దీని వల్ల ముక్కలకు పదార్థాలన్ని బాగా అంటుకుంటాయి. వండేటపుడు వంట పెద్దగా కాకుండా సన్నని సెగమీద నెమ్మదిగా వండాలి. ముక్కలు పెద్దగా ఉంటే గాట్లు చేయాలి. ఈ రకంగా రుచి బాగా పెరుగుతుంది.
రొట్టెలను మెత్తగా చేయడం ఎలా
మీరు రోటీని మృదువుగా చేయాలనుకుంటే, గోరువెచ్చని నీటితో పిండిని కలపండి, అలాగే దానికి 4-5 స్పూన్ల పాలు కూడా కలపండి. ఇది మీ రోటీలను చాలా మృదువుగా చేస్తుంది. దీంతో రోటీల రుచి కూడా పెరుగుతుంది. కూరగాయలు ఉడకబెట్టిన నీటిని పారేయకుండా ఈ నీటిని చపాతీ పిండికి కలపడం లేదా గ్రేవీస్ చేస్తే పోషకాలు పెరుగుతాయి.
గ్రేవీ మరింత రుచికరంగా
కూరలు చేసేటపుడు గ్రేవీ మరింత చిక్కగా, రుచికరంగా మారాలంటే అందులో జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు లేదా గసగసాల పేస్ట్‌ని ఉపయోగించండి. కట్ చేసిన వంకాయ, బంగాళాదుంప ముక్కలు రంగుమారకుండా నిరోధించడానికి, వాటిని ఒక ఉప్పు నీటిలో ఉంచండి. ఆకుపచ్చని ఆకు కూరలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార కలపండి, రంగు తాజాగా ఉంటుంది.
ఎక్కువ కాలం నిల్వ కోసం
అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, దానిని తయారుచేసేటప్పుడు కొంచెం నూనె, ఉప్పు కలపండి, రిఫ్రిజిరేటర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ఆకు కూరలు 5 నుండి 7 రోజుల వరకు తాజాగా ఉండాలంటే, వాటిని కోసి, మందపాటి ప్లాస్టిక్ కంటైనర్‌లో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. మిరపకాయల తొడిమెలు తీసేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
సంబంధిత కథనం