Daily Intake of Salt । కూరల్లో ఉప్పు ఎక్కువైతే యమ డేంజర్.. రోజుకు ఎన్ని గ్రాములు తినాలో తెలుసా?
Daily Intake of Salt: ఉప్పు ఎక్కువ తింటున్నారా? ఆహారంలో ఉప్పు ఎక్కువైతే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది. రోజుకి ఎన్ని గ్రాములు మించకూడదో, శాస్త్రజ్ఞులు సిఫారసు చేస్తున్న మోతాదు ఎంతో ఇక్కడ తెలుసుకోండి.
అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. ఏ కూరలో అయినా ఉప్పు వేస్తే దాని రుచి అద్భుతంగా మారుతుంది. ఉప్పులేని ఉప్పుచారు చప్పగా ఉంటుంది. మన భారతీయ వంటలలో దాదాపు ప్రతి పదార్థంలో ఉప్పు విరివిగా వినియోగిస్తాం. అయితే మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని తెలుసు. ఉప్పు ఎక్కువైతే రక్తపోటు ఎక్కువవుతుంది, థైరాయిడ్ సమస్యలు మరింత పెరుగుతాయి. ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై పరిశోధకులు తాజాగా రీసెర్చ్ చేశారు. వారి రీసెర్చ్‌లో చాలా భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తింటే అది మానసిక ఒత్తిడిని మరింత పెంచడానికి దోహదపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కార్డియోవాస్కులర్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, శాస్త్రవేత్తలు ఎలుకలపై అధ్యయనాలు చేపట్టారు. అధిక ఉప్పు కలిగిన ఆహారం తినడం ద్వారా ఒత్తిడి హార్మోన్ స్థాయిలు 75 శాతం మేర పెరుగుతున్నట్లు వారు కనుగొన్నారు.
"మనం ఏం తింటామో, మనం అలాగే ఉంటాం. అదే మన ప్రవర్తనను నిర్ణయిస్తుంది. అధిక ఉప్పు కలిగిన ఆహారం మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవలి. ఇది మన శ్రేయస్సును మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన దశ" అని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ సైన్స్ విభాగానికి చెందిన రీనల్ ఫిజియాలజీ ప్రొఫెసర్ మాథ్యూ బెయిలీ అన్నారు.
Daily Intake of Salt - రోజులో ఎంత మోతాదులో ఉప్పు తినాలి?
"అధిక ఉప్పు తినడం వల్ల మన గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు దెబ్బతింటాయని మనకు తెలుసు. అయితే తమ అధ్యయనం ద్వారా ఆహారంలో అధిక ఉప్పు మన మెదడు ఒత్తిడిని నిర్వహించే విధానాన్ని కూడా మారుస్తుందని వెల్లడైంది." అని మాథ్యూ బెయిలీ పేర్కొన్నారు. ఒకరోజులో ఒక వ్యక్తి ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలో ఆయన సూచించారు.
పెద్దలు రోజువారీగా తీసుకునే ఉప్పు మోతాదు ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. ఒకరోజులో తొమ్మిది గ్రాములకు మించి ఉప్పు తింటే ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, గుండెపోటులు, స్ట్రోకులు, వాస్కులర్ డిమెన్షియా ప్రమాదాలను పెంచుతుంది అని అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే చాలా మందికి అంతకు మించిన ఉప్పు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు తప్పదని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.
ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నిపుణులు ఎలుకలకు సాధారణ మానవ ఆహారాన్ని అందించారు. కొన్నిసార్లు ఉప్పు లేకుండా, మరికొన్ని సార్లు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినేలా చేశారు. ఉప్పు ఎక్కువైనపుడు ఎలుకలో ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరగడమే కాకుండా, పర్యావరణ ప్రతికూలతలతో ఏర్పడిన ప్రతిస్పందనలు మిగతా ఎలుకలతో పోలిస్తే రెట్టింపుగా ఉందని నిపుణులు గుర్తించారు.
ఈ ప్రకారంగా అధిక ఉప్పు తీసుకోవడం వలన ఆందోళన, దూకుడు స్వభావానికి దారితీస్తుందని తెలిపారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు.
సంబంధిత కథనం