Ankapur Chicken Recipe । అంకాపూర్ దేశీ చికెన్ కూర.. నాటు నాటు ఘాటు రుచి!
Ankapur Chicken Curry Recipe: అంకాపూర్ కోడికూర పేరు చెబితేనే నోరు ఊరుతుంది. మరి ఇది తినడానికి అంకాపూర్ వరకు వెళ్లలేకపోతే, ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. అంకాపూర్ నాటుకోడి కూర రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
పసందైన విందు భోజనంలో కోడికూర ఉండాల్సిందే, అందులోనూ నాటు కోడి కూర అయితే దాని రుచే వేరు. నాటుకోడి కూర అనగానే అంకాపూర్ దేశీ చికెన్ కూర మదిలో మెదులుతుంది. తెలంగాణ స్పెషల్ అంకాపూర్ దేశీ చికెన్ కర్రీ చాలా పాపులర్. కేసీఆర్ కి కూడా అత్యంత ప్రీతికరమైన వంటకం ఇదే. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో వండే ఈ నాటుకోడి రుచి, దాని వాసనలు ఎల్లలు దాటుతాయి. ఎంతో దూరంలో ఉండే వారు కూడా ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే ఆర్టీసీ బస్సులలో పార్శిల్ కూడా పంపిస్తారు.
కనుమ నాడు మాంసం లేనిదే ముద్ద దిగదు, మీరు మీ నాటు కోడితో సిద్ధంగా ఉంటే, ఘాటుగా అంకాపూర్ శైలిలో దేశీ కోడికూరను ఎలా తయారు చేయవచ్చో మేము మీకు ఇక్కడ తెలియజేస్తాం. అంకాపూర్ నాటు కోడి కూరలో ప్రధానమైనవి పూర్తిగా హోంమేడ్ మసాలాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఈ రుచికరమైన రెసిపీని తయారు చేయడం కొంచెం సమయం తీసుకుంటుంది, కానీ మిమ్మల్ని కచ్చితంగా సంతృప్తి పరుస్తుంది. పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా, సెలవురోజుల్లో అయినా ఇలా నాటుకోడి కూరను తయారు చేసుకోండి. అంకాపూర్ చికెన్ రెసిపీ ఈ కింద పేర్కొన్నాం చూడండి.
Ankapur Chicken Curry Recipe కోసం కావలసినవి
- నాటు కోడి- 1
- కారం- 1 స్పూన్
- ఉల్లిపాయలు - 2
- తాజాగా దంచిన అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
- ధనియాల పొడి - ఒక స్పూన్
- పసుపు - 1/2 టీస్పూన్
- తురిమిన ఎండు కొబ్బరి - 2 స్పూన్లు
- పల్లినూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ - 2 పావులు
- గరం మసాలా పొడి - 1 టీస్పూను
- మెంతి కట్ట - ఒకటి
- కరివేపాకు - ఒక రెమ్మ
- బిర్యానీ ఆకులు - రెండు
- రుచికి తగినంత ఉప్పు
అంకాపూర్ చికెన్ కూర తయారీ విధానం.
- ముందుగా బాగా కండపట్టిన 1 కిలో బరువు ఉండే నాటుకోడిని బొచ్చుపీకి శుభ్రం చేసుకోవాలి. ఆపై దానికి పసుపు రాసి నేరుగా మంటపై కాల్చాలి.
- కాల్చిన చికెన్ ను మీడియం సైజ్ ముక్కలుగా కోసుకోవాలి. లెగ్ పీస్ లను మాత్రం అలాగే ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కాల్చి, ముక్కలుగా చేసుకున్న చికెన్ లో కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు వేసి ఒక 2 నిమిషాలు మేరినేట్ చేసుకోవాలి.
- ఈలోపు స్టవ్ మీద గంజు పెట్టి రెండు చిన్న పావుల నూనె వేసి వేడిచేయాలి, నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
- ఆపై ఉల్లిపాయ ముక్కలు, మెంతి ఆకులు, కరివేపాకు వేసి వేయించాలి.
- అనంతరం చికెన్ ముక్కల్ని వేసి బాగా కలపాలి, ఆపై గ్రేవీకి తగినట్లుగా నీళ్లు పోసుకొని బోలు మూతపెటాలి. ఆ మూతలో కూడా నీరు పోసుకోవాలి, ఇలా అరగంట ఉడికించాలి.
- అరగంట తర్వాత మూతలోని నీరు వేడెక్కితే చికెన్ ఉడికిందని అర్థం, మీకు గ్రేవీ ఇంకా కావాలనుకుంటే ఆ మూతలోని వేడి నీరు కలుపుకోవాలి.
- ఆపై 10-15 నిమిషాలు చిక్కగా మారేంత వరకు ఉడికించుకోవాలి. పైనుంచి కొబ్బరి తురుము, ఒక టీస్పూన్ గరం మసాలా వేసి కలపాలి.
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఘుమఘుమలాడే అంకాపూర్ నాటుకోడి కూర రెడీ. వేడివేడిగా బగార అన్నంతో తింటే రుచి అదిరిపోతుంది.
సంబంధిత కథనం