Oil Free Nippattu Recipe । నూనె లేకుండా తయారు చేయండి నిప్పట్టు.. రుచిలో అదిరిపోయేట్టు!
Oil Free Nippattu Recipe: చాయ్ తాగుతూ కరకరలాడే నిప్పట్లు తింటే చాలా బాగుంటుంది కదా. అయితే నిప్పట్లు నూనె లేకుండా కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
మీరు నిప్పట్లను ఎప్పుడైనా తిన్నారా? కరకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటాయి, వీటినే తెలంగాణలో అయితే గారెప్పాలు, ఆంధ్రాలో అయితే చెక్కలు, కర్ణాటకలో అయితే నిప్పట్లు ఇలా ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. కానీ రుచిలో ఏమాత్రం తగ్గేదేలే అనేట్లుగా ఉంటాయి. పండగ సమయాల్లో ఇలాంటి నిప్పట్లు చేసుకొని కొన్నాళ్ల పాటు నిల్వచేసుకొని తినవచ్చు. సాయంత్రం వేళలో లేదా బ్రేక్ సమయంలో కరకరలాడించేందుకు ఇవి మంచి హోం మేడ్ స్నాక్స్ లాగా ఉంటాయి. అయితే సాధారణంగా ఈ నిప్పట్లను నూనెలో వేయించి తయారు చేస్తారు. కానీ నూనె లేకుండా కూడా ఈ గారెప్పాలను తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఆ రెసిపీని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం.
నిప్పట్లు, చెక్కలు లేదా గారెప్పాలు వీటిని మైదా పిండి లేదా బియ్యప్పిండితో చేస్తారు. కానీ ఇలా బియ్యప్పిండి మైదాతో చేసే అప్పాలు రుచికి బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యకరమైనవి కావని కొంతమంది అభిప్రాయం. అదేకాకుండా వీటిని నూనెలో వేయించి తయారుచేస్తారు కాబట్టి అలా కూడా వీటిని తినకుండా ఉంటారు. అయితే అందరికీ నచ్చేలా, గోధుమపిండితో కరకరలాడే నిప్పట్లను తయారు చేయవచ్చు. అంతేకాకుండా వీటిని నూనె లేకుండా చేస్తాం కాబట్టి ఎక్కువ కాలం నిల్వచేసినప్పటికీ కూడా వీటి తాజాదనం గానీ, వాసనలో గానీ ఎలాంటి మార్పు ఉండదు. మరి మీకు నూనెలేని నిప్పట్లు తయారు చేసుకోవాలనుకుంటే ఈ కింద రెసిపీ ఉంది చూడండి.
Oil Free Nippat - Gareppa Recipe కోసం కావలసిన పదార్థాలు
- గోధుమ పిండి - 2 కప్పులు
- పాలపొడి - 1 చెంచా
- బేకింగ్ సోడా - 1/4 tsp
- చక్కెర - 1 టీస్పూన్
- తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 6
- కరివేపాకు - 5 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - 1/2 కట్ట
- ఉల్లిపాయలు - 2
- నెయ్యి - 1/4 కప్పు
- ఉప్పు - రుచి ప్రకారం
నూనె లేని నిప్పట్టు తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, పాలపొడి, బేకింగ్ సోడా, చక్కెర, ఉప్పు కలపాలి.
- ఇప్పుడు పిండి గిన్నెలో 1/4 కప్పు నెయ్యి వేసి అన్నీ బాగా కలపాలి.
- తర్వాత తరిగిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.
- అనంతరం కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండి కంటే గట్టిపడే వరకు కలుపుకుని మూతపెట్టి 10 నిమిషాలు అలాగే ఉంచాలి.
- ఇప్పుడు పిండిని ప్యాటీలా చేసి, దాని చుట్టూ ఫోర్క్‌తో రంధ్రాలు వేయండి, లేకపోతే నిప్పట్టు పూరీలా ఉబ్బుతుంది.
- ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టి దానిపై వైర్ రాక్ లేదా గ్రిల్ పెట్టి 5 నిమిషాలు వేడి చేయండి.
- తయారుచేసిన నిప్పట్లను బేకింగ్ ట్రేలో ఉంచి, మూత పెట్టి 8-10 నిమిషాలు తక్కువ మంటలో కాల్చండి.
- ఆ తర్వాత నిప్పట్టును తిప్పి బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండువైపులా బేక్ చేస్తే కరకరలాడే నిప్పట్లు (Crispy Crackers) రెడీ.
ఈ రకంగా బేక్ చేసిన నిప్పట్లు ఒక నెల పాటు తాజాగా ఉంటాయి.
సంబంధిత కథనం