Lentil bobotie | ఆఫ్రికా పప్పు.. అప్పు చేసైనా తినాలనిపించే పప్పు రెసిపీ ఇది!-bored of eating dal rice try this south african lentil bobotie to give some continental touch ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lentil Bobotie | ఆఫ్రికా పప్పు.. అప్పు చేసైనా తినాలనిపించే పప్పు రెసిపీ ఇది!

Lentil bobotie | ఆఫ్రికా పప్పు.. అప్పు చేసైనా తినాలనిపించే పప్పు రెసిపీ ఇది!

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 02:32 PM IST

Lentil bobotie Recipe: ఎప్పుడూ ఒకేరకమైన పప్పు తింటూ విసిగెత్తిపోతున్నారా? అయితే కొత్తగా ఇలా ఒకసారి ఆఫ్రికా పప్పు వండుకొని తినండి. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Lentil bobotie Recipe
Lentil bobotie Recipe (Slurrp)

మీకు పప్పు అంటే ముందుగా గుర్తుకొచ్చేది, ముద్దగా ఉండే ముద్దపప్పు. కొంతమందికి పప్పు అంటే ఎవరైనా వ్యక్తులు గుర్తుకు రావచ్చు, కానీ అలా ఆలోచించడం తప్పు. ఇక్కడ చెప్పుకునే ఒక పప్పు గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి పప్పును మీరు ఇంతకు ముందు ఎన్నడూ తినకపోయి ఉండవచ్చు. మీరు ఏదైనా పెళ్లికి వెళ్తే ముద్దపప్పు, పప్పుచారు వంటివి వడ్డిస్తారు, అయితే ఏదైనా పెద్ద స్టార్ హోటెల్‌లో వేడుకకు వెళ్లినపుడు మీరు 'లెంటిల్ బోబోటీ' వంటకాన్ని రుచి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కూడా పప్పుతో చేసే ఒక వంటకమే. చాలా రుచిగా ఉంటుంది, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది ఆఫిక్రా దేశాలలో వండే ఒక సాంప్రదాయ వంటకం. మరి ఇలాంటి పప్పును రుచి చూడాలంటే ఏ స్టార్ హోటల్‌కో లేక ఆఫికాకో వెళ్లాలనుకుంటున్నారా? అవసరం లేదు, మీరే మీ ఇంట్లో సులభంగా వండుకోవచ్చు. రోజూ ఉప్పులేని పప్పుచారు రుచి మీకు బోర్ కొడుతుంటే ఇలా ఒకసారి లెంటిల్ బోబోటీ వండుకొని చూడండి.

గ్రేటర్ నోయిడాలోని క్రౌన్ ప్లాజాకు చెందిన చెఫ్ అబిగైల్ మ్బాలో HT లైఫ్‌స్టైల్‌తో ఈ ప్రత్యేకమైన దక్షిణాఫ్రికా పప్పు వంటకం లెంటిల్ బోబోటీ రెసిపీని పంచుకున్నారు. ఆ రెసిపీని ఈ కింద అందించాం, మీరు ఓ సారి ప్రయత్నించి చూడండి.

Lentil bobotie Recipe కోసం కావలసినవి

  • పప్పు 200 గ్రాములు
  • పచ్చి బఠానీలు 100 గ్రాములు
  • క్యారెట్లు 100 గ్రా
  • పుట్టగొడుగులు 100 గ్రా
  • టొమాటో ప్యూరీ 50 మి.లీ
  • ఉల్లిపాయలు 200 గ్రా
  • అల్లం 10 గ్రా
  • వెల్లులి 1
  • తందూరి మసాలా 20 గ్రా
  • గరం మసాలా 20 గ్రా
  • పసుపు 10 గ్రా
  • మిసెస్ బాల్స్ చట్నీ 50 గ్రా
  • కూరగాయల స్టాక్ 400ml
  • వంట నూనె 150 మి.లీ
  • లవంగాలు 6
  • స్టార్ అనీస్1
  • ఏలకులు 3
  • జీలకర్ర ¼ టీస్పూన్
  • తాజా క్రీమ్ 150 మి.లీ
  • బిర్యానీ ఆకులు 4
  • రుచికి తగినంత ఉప్పు
  • కొత్తిమీర
  • గుడ్లు 2- 4 (ఐచ్ఛికం)

ఆఫ్రికా పప్పు లెంటిల్ బోబోటీ తయారీ విధానం

1. ముందుగా పప్పును మెత్తగా నానబెట్టుకోండి. మరోవైపు ఒక పాన్ లో పైన పేర్కొన్న అన్ని సుగంధ ద్రవ్యాలను దోరగా వేయించి, గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకొని పక్కనపెట్టుకోండి.

2. ఇప్పుడు కడాయిలో వంట నూనెను వేడి చేసి ఉల్లిపాయలు ముక్కలు, వెల్లుల్లి, పుట్టగొడుగుల ముక్కలను వేసి వేయించండి, ఆపై అన్ని రుబ్బుకున్న మిశ్రమం, మిగతా దినుసులను వేసి వేయించండి. అవసరం మేరకు వంటనూనెను కలపండి.

3. అనంతరం టొమాటో ప్యూరీ, ఉప్పు, అల్లం, మిసెస్ బాల్స్ చట్నీ వేసి కలపండి.

4. ఆపైన నానబెట్టిన పప్పు వేసి, కూరగాయలు ఉడికించిన స్టాక్ లేదా నీరు పోసి మూతపెట్టి 5-20 నిమిషాలు మెత్తగా ఉడికించాలి.

5. అనంతరం బఠానీలు, క్యారెట్ల ముక్కలను వేసి ఉడికించాలి. పప్పు సిద్ధం అయినట్లే. (మీరు దీని అన్నంలో కలుపుకొని తినవచ్చు).

6. ఇప్పుడు మరొక గిన్నెలో తాజా క్రీమ్ వేయండి, అందులో గుడ్లు గిలకొట్టండి. ఉప్పు, కారం వేసి కలపండి.

7. వండిన పప్పును బేకింగ్ డిష్‌లోకి బదిలీ చేయండి, ఆపై దానిపై గుడ్డు మిశ్రమంతో లేయర్ వేయండి. గుడ్డు మిశ్రమంపై ఒక బిర్యానీ ఆకు ఉంచండి

8. 180 o C వద్ద 15 నిమిషాలు బేక్ చేయండి. ఆపైన బయటకు తీస్తే లెంటిల్ బోబోటీ రెడీ.

బేకింగ్ చేసే వీలు లేకపోతే ఒక ఆమ్లెట్ వేసుకొని పైన లేయర్ లాగా వేయండి, లేదా పూర్తిగా శాకాహారం కావాలనుకుంటే పప్పు ఉడికిన తర్వాత తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం