పప్పు తింటున్నారా? ఇలా తింటే మాత్రం పప్పులో కాలేసినట్లే!-never skip soaking lentils in water here is why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Never Skip Soaking Lentils In Water, Here Is Why

పప్పు తింటున్నారా? ఇలా తింటే మాత్రం పప్పులో కాలేసినట్లే!

Manda Vikas HT Telugu
Dec 28, 2021 05:58 PM IST

పప్పు ధాన్యాలను తినటం ఎంత ముఖ్యమో,దాని ప్రయోజనాలను పొందాలంటే సరైన పద్ధతిలో వండటమూ అంతే ముఖ్యం.

Dal- Lentils
Dal- Lentils (Stock Photo)

పప్పు మన తెలుగింటి భోజనంలో అతి ముఖ్యమైన ఆహార పదార్థం. కొందరికి ప్రతిరోజూ ముద్దపప్పు, ఆవకాయ లేనిదే ముద్దదిగదు. పప్పన్నం లేని పెళ్లి భోజనం కూడా ఉండదు. అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. పప్పు ధాన్యాల్లో ఉండే ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం గుణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు LDL కొలెస్ట్రాల్‌ను దెబ్బతీసే రక్త స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే పప్పు ధాన్యాలను తినటం ఎంత ముఖ్యమో , దాని ప్రయోజనాలను పొందాలంటే సరైన పద్ధతిలో వండటమూ అంతే ముఖ్యం.  చిన్న చిట్కా ఉపయోగించి వండుకోవడం ద్వారా అందులో ఉండే పోషకాలు  శరీరానికి అందుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

పప్పును సరిగ్గా ఉడికించకపోతే జీర్ణసమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు సులభమైన పరిష్కారంగా పప్పును వండే ముందు బాగా నానబెట్టాలని చెబుతున్నారు. ఇంతేనా, ఈ మాత్రం మాకు తెలియదా? అని తీసిపారేయకండి. ఏ రకం పప్పును ఎంత సమయం పాటు నానబెట్టాలో ఇక్కడ వివరంగా ఇచ్చాము, గమనించండి.

పప్పుధాన్యాలు నానబెట్టుట

ముందుగా మీరు ఎంచుకున్న పప్పును శుభ్రంగా కడగండి, ఆ తర్వాత  సరిపోయే గిన్నెను తీసుకొని మంచినీటిలో పప్పును  నానబెట్టండి.

కంది పప్పు, పెసర్లు, మినుములు మరియు మసూర్ పప్పులను 8 నుండి 12 గంటలు నానబెట్టడం మంచిది.

పెసరపప్పు, విడగొట్టిన పప్పును 6 నుండి 8 గంటలు నానబెట్టాలి.

రాజ్మా, శనగలు లాంటి చిక్కుడు గింజల్లాంటి పప్పులను 12-18 గంటలు నానబెట్టాలి.

ఇక ఇలా కచ్చితమైన సమయం పాటు నానబెట్టేంత ఓపిక లేకపోతే, రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వండుకోవడం కూడా సులభమైన, ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.

పప్పు ధాన్యాలను నానబెట్టి వండుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు:

జీర్ణక్రియ మరియు శరీరం యొక్క పోషకాహార శోషణ మెరుగుపడుతుంది.

గ్యాస్, ఉబ్బరం కలిగించే లెక్టిన్స్, ఫైటేట్‌లను తటస్థీకరిస్తుంది.

పప్పులను నానబెట్టడం వల్ల దాని వంట సమయం కూడా తగ్గుతుంది.

చిక్కుడు లాంటి గింజలను నానబెట్టడం ద్వారా వాటిలో మొలకలు రావొచ్చు, తాజాదనం పెరుగుతుంది.

కాబట్టి లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మీరు వంట చేసేవాళ్లైతే, పప్పును నానబెట్టే అలవాటును చేసుకొని తద్వారా గరిష్ఠ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేయండి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్