Singapore Fried Rice Recipe । ఆకలి దంచేస్తే.. త్వరత్వరగా సింగపూర్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి ఇలా!
Singapore Fried Rice Recipe: మీరు బాగా ఆకలితో ఇంటికి వచ్చినపుడు, లంచ్ లేదా డిన్నర్ కోసం కేవలం 15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోగలిగే సింగపూర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఇక్కడ చూడండి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా పనిలో నిమగ్నం అయితే, మధ్యాహ్నం అయ్యేసరికి కడుపు కాలుతుంది. ఆకలికి ఎంతమాత్రం ఆగలేము, బీపీ పెరిగిపోతుంది. ఈ సమయంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామనుకున్నా అది వచ్చేసరికి కొంత టైం పడుతుంది, బయటకు వెళ్లి తినాలన్నా అదే పరిస్థితి. అంతేకాకుండా బయట చేసిన ఆహారం ఎంతమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా మీకు మీరుగా ఏదైనా చేసుకొని తినేయచ్చు. అది కూడా అన్నం తింటేనే మనకు భోజనం చేసినట్లుగా ఉంటుంది. మరి త్వరత్వరగా చేసుకొని తినగలిగే వంటకాలు ఏమున్నాయి అని ఆలోచిస్తున్నారా? అన్నంతో రకరకాల వంటకాలను చిటికెలోనే సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అలాంటి ఒక రెసిపీని తెలియజేస్తున్నాం.
సింగపూర్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సులభమైన, త్వరగా చేసుకునే రైస్ రెసిపీ. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అన్నం, కొన్ని కూరగాయల ముక్కలు, సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేసే ఒక చైనీస్ ఫ్రైడ్ రైస్ తరహా వైవిధ్యమైన వంటకం. మీరు కావాలంటే ఇందులో రొయ్యలు, గుడ్లు లేదా చికెన్‌తో కూడా సిద్ధం చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింగపూర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి, సమయం తక్కువ ఉన్నప్పుడు మీరూ ఇలాంటి రెసిపీని ప్రయత్నించవచ్చు.
Singapore Fried Rice Recipe కోసం కావలసినవి
- 2 కప్పుల అన్నం
- 1 టీస్పూన్ వెల్లుల్లి
- 1/2 స్పూన్ కారం
- 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్
- 1/2 కప్పుల క్యాప్సికమ్
- 1/4 కప్పు క్యారెట్లు
- 1 పచ్చిమిర్చి
- 1/2 కరివేపాకు రెమ్మ
- 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్
- 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్
- 1 టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్
- 1 టేబుల్ స్పూన్ చిల్లీ గార్లిక్ సాస్
- 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె
సింగపూర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా బియ్యాన్ని కడిగి, అన్నంగా వండుకోవాలి. ఈలోపు కూరగాయలన్నింటిని చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
- ఇప్పుడు ఒక వోక్‌లో నూనె వేడి చేసి, సువాసన వచ్చేలా వెల్లుల్లిని వేయించాలి. ఆపై కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్‌లను వేసి కొన్ని నిమిషాల పాటు టాసు చేయండి.
- ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి, ఉప్పు కూడా వేసి కూరగాయలు ఉడికినంత వరకు వేయించాలి.
- ఇప్పుడు వండిన అన్నాన్ని చల్లబరిచి వోక్‌లో వేసి మీ వద్ద అందుబాటులో ఉన్న అన్ని సాస్‌లను వేయండి. ఆపై కారం కూడా వేసి, అన్ని బాగా కలుపుతూ టాసు చేయండి.
అంతే, ఘుమఘుమలాడే వేడివేడి సింగపూర్ ఫ్రైడ్ రైస్ రెడీ!
సంబంధిత కథనం