Water-rich Fruits । చలికాలంలో మీ ఆరోగ్యం చల్లగా ఉండాలంటే మార్గాలు ఇవిగో!
Water-rich Fruits for Winter- చలికాలంలోనూ మనకు తెలియకుండా డీహైడ్రేషన్ కు గురవుతాం. ఈ సమస్యను అధిగమించేందుకు నీటి శాతం అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా దప్పిక అనేది ఎక్కువ వేయదు. ప్రజలు సాధారణం కంటే తక్కువ నీటిని తాగుతారు. చెమట తక్కువగా పడుతుంది, మూత్రవిసర్జన ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో తెలియకుండానే శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.
ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. చలిగాలులలు దగ్గు, జలుబు, ఆస్తమా, సైనసిటస్ ఇతర చర్మ సమస్యలతో పాటు అదనంగా శరీరంలో నీటి శాతం తగ్గడం వలన ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకం, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలతో ఆందోళన చెందుతుంటారు. కానీ, వీటన్నింటికి అవసరమైన స్థాయిలలో నీరు త్రాగకపోవడం కూడా ఒక కారణం అని గుర్తించరు. ఇది ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా మీ శరీర పనితీరును పూర్తిగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి చలికాలంలోనూ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. చర్మం తేమను కోల్పోకుండా కాపాడాలి, చర్మం పొడిబారడాన్ని నివారించాలి.
దాహం వేయనపుడు, నీరు తాగాలని అనిపించనపుడు ఈ చలికాలంలో శరీరం నిర్జలీకరణకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే, ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటుండటం, పండ్లను, పండ్ల రసాలను, సూప్ లను తరచుగా తీసుకోవాలి. అదే సమయంలో ఈ చలికాలంలో చాలా మంది చలిని తట్టుకోవాలనే సాకుతో ఆల్కాహాల్ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఈ ఆల్కాహాల్ శరీరంలోని నీటిని ఆవిరి చేసేస్తుంది. కాబట్టి ఆల్కాహాల్, చక్కెర కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. బదులుగా కాలానుగుణంగా లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం.
Water-rich Fruits for Winter- నీటి శాతం అధికంగా ఉండే పండ్లు
ఈ శీతాకాలంలో మనకు చాలా రాకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్‌లో ఎలాంటి పండ్లు తీసుకోవాలో నిర్జలీకరణను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్
ఆపిల్స్‌లో 80-85 శాతం నీరు ఉంటుంది. ఇంకా సోడియం, కొవ్వులు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఆపిల్ పండ్లు సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-సి కూడా ఉంటుంది.
ద్రాక్షపండు
ద్రాక్ష పండ్లలో 88 శాతం నీరు ఉంటుంది. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ద్రాక్షపండ్లు తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గుతుంది. మీరు పడుకునే ముందు ద్రాక్షపండ్ల రసం తీసుకోవచ్చు.
దానిమ్మ
దానిమ్మపండులో 82 శాతం నీరు ఉంటుంది, 2 శాతం ప్రోటీన్ అలాగే 1 శాతం కొవ్వును కలిగి ఉంటుంది. అయినా కేవలం 50 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ పండు చాలా ఆరోగ్యకరం.
నారింజ
ఈ పండులో 86 శాతం నీరు ఉంటుంది. నారింజలలో విటమిన్- సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ పండు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, పోషకాలు ఎక్కువ ఉంటాయి.
పైనాపిల్
పైనాపిల్‌లో 80 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది, జీర్ణక్రియ సమస్యను పరిష్కరించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్