Meat Digestion Tips । మాంసం, మసాలా ఆహారాలు సులభంగా జీర్ణం అయ్యేందుకు చిట్కాలు!
Meat Digestion Tips: వారాంతంలో మాంసాహారం చాలా మంది తింటారు. అయితే తినేటపుడు బాగుంటుంది కానీ అది అరగాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. ఇవి పాటిస్తే మటన్ లాంటి మాంసాహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది.
సాధారణ మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావటానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అయితే ఇందులో ద్రవాలు, కూరగాయలు ఇతర పీచు పదార్థాలు ఇంకాస్త తక్కువ సమయం తీసుకుంటాయి. ఆహారం జీర్ణం అవడం అనేది మీరు తినే సమయం, తినే ఆహారం, మీ శరీర తత్వం, జీవక్రియ, లింగం, వయస్సు మరియు కొన్ని ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణం అవుతాయి, అయితే కొవ్వులు, ప్రోటీన్ పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. మాంసంలో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ఆహారాలతో పోలిస్తే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.
మాంసం జీర్ణం కావడానికి కనీసం రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. మటన్ జీర్ణం కావటానికి నాలుగు రోజుల వరకు పడుతుంది. అయితే, జీర్ణక్రియ ప్రక్రియను చాలా నిమ్మదించేది కొవ్వు. ఈ కొవ్వులు, నూనెలు సాపేక్షంగా సంక్లిష్టమైన అణువులు. అందువల్ల త్వరగా జీర్ణం అవవు.
Meat Digestion Tips- మాంసాహారం జీర్ణం అయ్యేందుకు చిట్కాలు
తిన్న ఆహారం జీర్ణం అవనపుడు కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. మలబద్ధకం, వికారం,నోరు అలాగే శరీరం నుంచి దుర్వాసన రావడం, రోగనిరోధక శక్తి మందగించడం మొదలైన ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఇక్కడ సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మాంసం త్వరగా జీర్ణం అవుతుంది.
కొవ్వు లేకుండా తినడం
మీరు తినే మాంసంలో కొవ్వు తక్కువ ఉండేలా చూసుకోండి. అలాగే మెరినేట్ చేసిన మాంసంను ఎంచుకోండి. మాంసం రాత్రి నుంచి మెరినేట్ చేసి ఉంచడం ద్వారా అది ప్రోటీన్ల విచ్ఛిన్నతను పెంచుతుంది. దీంతో మాంసం తేలికగా జీర్ణం అవుతుంది. ఆ వంటకం కూడా రుచిగా వస్తుంది.
ఎక్కువ సార్లు నమలడం
మీకు మాంసం జీర్ణం అవడంలో ఇబందులు, మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే ఆహారాన్ని ఎక్కువ నమలండి. ఇది మీ కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలను విచ్ఛిన్నం చేయడం సులువు చేస్తుంది. కడుపు వాతావరణాన్ని చాలా ఆమ్లంగా చేస్తుంది, మాంసం వేగంగా జీర్ణం కావడానికి మరింత సహాయపడుతుంది.
పైనాపిల్ తినండి
మటన్ లాంటి ప్రొటీన్ అధికంగా ఉండే మాంసాహార తినే ముందు లేదా తినేటపుడు కొన్ని పైనాపిల్ ముక్కలు తినండి. ఈ పండులో బ్రోమెలైన్ అని పిలిచే సహజ ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్ల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, వాటిని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
ప్రోబయోటిక్స్ తీసుకోండి
మీరు తినే విందు భోజనంలో ప్రోబయోటిక్స్ చేర్చండి. పెరుగు, కేఫీర్ వంటి ప్రోబయోటిక్‌లు మాంసం జీర్ణక్రియకు సహాయపడే ఉత్తమ పదార్థాలు. ఇవి పేగు ఆరోగ్యానికి సహాయపడే స్నేహపూర్వక బ్యాక్టీరియాను అందిస్తాయి.
కూరగాయలు కలుపుకోండి
అచ్ఛంగా మాంసం కాకుండా క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ మొదలైన కూరగాయలను కలుపుకొని తినడం వలన అవి మాంసం తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి.
సంబంధిత కథనం