Dehydration | డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే!
Dehydration.. రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలా డీహైడ్రేషన్ అయినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.
సాధారణంగా మనకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం. మూత్రవిసర్జన చేసినప్పుడు, చెమట ఎక్కువగా పట్టినప్పుడు మనకు దాహం వేస్తుంది. అయితే సాధారణ దాహానికి, డీహైడ్రేషన్‌కు తేడా ఉంటుందన్న విషయం గమనించాలి. శరీరం మరీ ఎక్కువగా ద్రవాలను కోల్పోయిన సమయంలో డీహైడ్రేషన్‌కు గురవుతాం.
ఆ సమయంలో శరీరం చేయాల్సిన సాధారణ పనులైన ఆక్సిజన్ సరఫరా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణం చేయడం వంటివి సరిగా జరగవు. ఈ నేపథ్యంలో అసలు డీహైడ్రేషన్‌కు ఎలా గురవుతాం? అలా అయినప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.
డీహైడ్రేషన్ ఎలా అవుతుంది?
మనలో చాలా మంది రోజూ తాగాల్సినన్ని నీళ్లు తాగరు. మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్న సమయంలోనూ శరీరాన్ని పూర్తి హైడ్రేటెడ్‌గా ఉంచడం ఓ సవాలే. అయితే అసలు డీహైడ్రేషన్‌కు గురి కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
- విరేచనాలు, వాంతులు శరీరంలోని ద్రవాలను, అత్యవసర ఖనిజాలైన ఎలక్ట్రోలైట్స్‌ను పూర్తిగా అడుగంటేలా చేస్తాయి. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్, పొట్టలో వైరస్ కారణంగా ఈ విరేచనాలు, వాంతులు అవుతుంటాయి.
- జ్వరం వచ్చిన సమయంలోనూ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఒంట్లోని వేడిని తగ్గించడానికి శరీరం తనకు తానే ఎక్కువగా ప్రయత్నించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- చెమట మరీ ఎక్కువగా పట్టిన సమయంలోనూ శరీరంలోని ద్రవాలన్నీ బయటకు వెళ్లి డీహైడ్రేషన్‌కు గురవుతాం.
- ఇక మూత్రవిజర్జన ఎక్కువగా జరిగినప్పుడు కూడా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లలో ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది.
డీహైడ్రేషన్ సమయంలో కనిపించే లక్షణాలు
సాధారణంగా తక్కువగా నీళ్లు తాగే వృద్ధులు, తరచూ విరేచనాలు, వాంతులతో బాధపడే చిన్నారులు ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తిమ్మిర్లు
ద్రవాలు తక్కువైనప్పుడు కండరాల్లో ఉన్న ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను మీ శరీరం సేకరిస్తుంది. దీని కారణంగా కండరాల్లో ద్రవాల స్థాయి తగ్గి వాటిలో నొప్పితో కూడిన తిమ్మిర్లు వస్తాయి. ఒంట్లో సోడియం మోతాదు తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉన్న ద్రవాలు తీసుకోవడం, లేదంటే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను నీటితో సహా తీసుకోవడం వంటివి చేస్తే.. శరీరంలో మళ్లీ తగిన మోతాదులో ద్రవాలు చేరుతాయి.
తలనొప్పి
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. నిజానికి తలనొప్పికి చాలా కారణాలే ఉన్నా.. అందులో ఈ డీహైడ్రేషన్ కూడా ఒకటి. ఈ సమయంలో కాస్త ఎక్కువ మోతాదులో నీళ్లు తాగి చూడండి. వెంటనే తలనొప్పి తగ్గిందంటే.. శరీరం డీహైడ్రేట్‌కు గురైందని అర్థం.
అలసట
శరీరంలో ద్రవాలు తగ్గినప్పుడు మీ రక్తనాళాలు సంకోచిస్తాయి. ఈ సమయంలో మీ శరీరం ముఖ్యమైన భాగాలైన గుండె, మెదడు సరిగ్గా పని చేయడానికి ఎక్కువ ద్రవాలను అందించే ప్రయత్నం చేస్తాయి. దీంతో శరీరంలోని మిగతా అవయవాలు నెమ్మదిగా పని చేస్తుంటాయి. దీని కారణంగా నిస్సత్తువగా, అలసటగా అనిపిస్తుంది. ఇక శరీరంలో ఎలక్ట్రోలైట్ల స్థాయి తగ్గడం వల్ల మగతగా ఉంటుంది.
ముదురు రంగులో మూత్రం
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు.. మూత్రం ముదురు రంగులో ఉంటుంది. దుర్వాసన కూడా వస్తుంది. శరీరంలో తగిన స్థాయిలో ద్రవాలు ఉన్నప్పుడు మూత్ర లేత పసుపు రంగులో, అసలు వాసన లేకుండా ఉంటుంది. దీనిని బట్టి మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు చెప్పవచ్చు.
నోరు, పెదవులు ఎండిపోవడం
శరీరంలో ద్రవాలు తక్కువైన సమయంలో ముఖ్యమైన భాగాలకు మిగిలిపోయిన ద్రవాలు వెళ్తాయి. దీంతో నోరు, పెదవులు, చర్మం వంటి వాటికి తగిన మోతాదులో ద్రవాలు అందవు. దీంతో అవి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. శ్వాసలో కూడా దుర్వాసన వస్తుంది. నాలుక తెల్లగా మారుతుంది.
అయోమయం
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు మనిషికి అంతా అయోమయంగా ఉంటుంది. సాధారణంగా సరిపడా నిద్ర లేనప్పుడు ఇలా అవుతుంది. అలాగే తగినన్ని ద్రవాలు లేకపోయినా ఇలాగే జరుగుతుంది. దీనికితోడు గుండె, శ్వాస వేగంపెరగడం, వణుకు వంటివి వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.
సంబంధిత కథనం
టాపిక్