తెలుగు న్యూస్  /  Lifestyle  /  Yoga For Age 40 Plus Men And Women, Best Poses To Stay Fit And Active Against The Age

Yoga At 40s । వయసు 40 దాటిన వారికి ఇవి ఎంతో అద్భుతమైన యోగాసనాలు!

HT Telugu Desk HT Telugu

19 March 2023, 9:40 IST

    • Yoga For 40 Year Olds: వయసు 40 దాటిన తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. చురుకైన జీవనశైలిని అనుసరించడం ముఖ్యం. ఈ వయసులో ఆచరించాల్సిన కొన్ని సులభమైన యోగాసనాలు చూడండి.
Yoga For Everybody over 40 Year Old
Yoga For Everybody over 40 Year Old (Unsplash)

Yoga For Everybody over 40 Year Old

Yoga At 40s: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదు. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు తమ పిల్లలను పైచదువులు చదివించడం, పెళ్లిళ్లు చేయడం, వారిని జీవితంలో స్థిరపడేలా చేయడం కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతుంటారు, ఆరోగ్యంపై సరైన శ్రద్ద కలిగి ఉండరు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను వారు ఈ వయసులోనే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా చురుకైన జీవనశైలిని కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం అవసరం

ఈ వేసవిలో కఠినమైన ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. యువకులతో పోలిస్తే, పెద్దవారు ఎక్కువగా అలసిపోతారు. వ్యాయామాలు చేయడానికి కూడా ఈ వేసవి సీజన్ కష్టతరంగా ఉంటుంది. అయితే యోగా ఇందుకు చక్కని పరిష్కారంగా ఉంటుంది.

Yoga for Men and Women in 40s- వయసు 40 దాటిన వారికి యోగాసనాలు

యోగాతో శరీరం, మనస్సు ఫిట్‌గా ఉండేలా చూసుకోవచ్చు. వేడి వాతావరణంలోనూ యోగాసనాలు అనుకూలంగా ఉంటాయి. వయసు 40 దాటిన వారికి ఎలాంటి యోగాసనాలు ప్రయోజనకరంగా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

బద్ధ కోణాసనం- Butterfly Pose

ఈ భంగిమను ఆచరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది , గుండెను ఉత్తేజపరుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా సుప్త బద్ధ కోణాసనం మీ కటి ప్రాంతం, లోపలి తొడలు, మీ మోకాళ్లకు చాలా అవసరమైన స్ట్రెచింగ్స్ ను అందిస్తుంది. మీకు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా తేలికపాటి డిప్రెషన్, ఆందోళనలు లేదా మనసులోని ఉద్రిక్తతలు ఈ ఆసనంతో నయం అవుతాయి.

తాడాసనం- Mountain Pose

ఈ భంగిమ చాలా సరళంగా అనిపించినప్పటికీ, తాడాసనం సంక్లిష్ట ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది కండరాల అసమతుల్యతను సరిచేయడానికి, మీ శరీర భంగిమను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకా సయాటిక్ నొప్పి నుండి ఉపశమనం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, కండరాలకు సరైన ఆకృతిని ఇవ్వడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఆసనం మీ వెన్ను, తుంటి, కాళ్ళను బలోపేతం చేస్తుంది.

ముక్తాసనం- Liberation Pose

దీనినే విముక్తి భంగిమ అని కూడా పిలుస్తారు, ఇది ధ్యానం, ప్రాణాయామం కోసం ఉపయోగించే యోగా భంగిమ. ఈ ఆసనం సాధన చేయడం ద్వారా వీపు, పిరుదుల కండరాలను సాగదీస్తుంది. వెన్నెముక, తుంటి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మెడను సడలిస్తుంది. ఈ ఆసనం శరీరంలోని అన్ని కీళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది వెనుక భాగపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది, జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.

శవాసనం- Corpse Pose

ఇది చాలా సులభమైన ఆసనం, ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మీకు లోతైన ధ్యానం లభిస్తుంది. ఇది కణజాలం, కణాల మరమ్మత్తును చేస్తుంది. ఒత్తిడిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని పునరుజ్జీవన స్థితిలో ఉంచుతుంది. రక్తపోటు, ఆందోళన, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని గ్రౌండింగ్ చేయడానికి అలాగే శరీరంలోని వాత దోషాన్ని (గాలి మూలకం అసమతుల్యత) తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన యోగా భంగిమ.