Hypertension | అధిక రక్తపోటును సహజంగా నియంత్రించే 5 ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!
Ayurvedic Herbs To Control Hypertension: అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు.. సహజ మార్గాలలో దీనిని ఎలా నియంత్రించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
శరీరంలోని పోషకాలు, ఆక్సిజన్ వివిధ అవయవాలకు సరిగ్గా అందాలంటే రక్తప్రసరణ సరిగ్గా జరగాలి. రక్త ప్రసరణ ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. మీ వయస్సుతో సంబంధం లేకుండా, మీ రక్తపోటును ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడానికి మీరు చర్యలు తీసుకోవాలి. శరీరంలో అన్ని కీలక జీవ లక్షణాలు సాధారణ స్థాయిలలో ఉండాలి, అలాగే రక్తప్రసరణ కూడా. సాధారణ రక్తపోటు స్థాయి 120/80 mmHg కంటే తక్కువగా ఉంటుంది. ధమని గోడలపై రక్త ప్రవాహ ఎక్కువైతే దానిని అధిక రక్తపోటు (High Blood Pressure) అని పిలుస్తారు.
రక్త ప్రసరణ వేగం 140/90 mmHg కంటే ఎక్కువ ఉంటే దానిని అధిక రక్తపోటుగా చెప్తారు, ఒత్తిడి (BP) తీవ్రమైనపుడు ఈ స్థాయిలు 180/120 mmHg వరకు వెళ్తాయి. ఇది చాలా తీవ్రమైన రక్తపోటుగా పరిగణిస్తారు.
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అధిక రక్తపోటుకు లక్షణాలు కనిపించవు. కానీ చికిత్స తీసుకోని పక్షంలో, ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు కారణమవుతుంది. తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఆందోళన వంటివి అధిక రక్తపోటు లక్షణాలు. అధిక రక్తపోటు కారణంగా కిడ్నీ దెబ్బతినడం, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ ప్రధానంగా సంభవిస్తాయి. ఔషధాలు తీసుకుంటూ ఉండటం వలన ఈ హైబీపీ (Hypertension) కంట్రోల్ చేయవచ్చు.
Natural Ways To Control Hypertension- రక్తపోటు నియంత్రణకు సహజ మార్గాలు
సహజంగా రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద డాక్టర్ దీక్షా భావ్సర్ రక్తపోటును నియంత్రించడానికి కొన్ని మూలికలను ఆహారంగా తినాలని సూచించారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
1.నల్ల మిరియాలు
నల్ల మిరియాలను మనం చాలా రకాల వంటలలో ఉపయోగించవచ్చు. ఇది మన పోపులపెట్టెలో ఉండే ఒక బలమైన, ఘాటైన సుగంధదినుసు. ఇది సహజంగా వేడి గుణాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో వాత, కఫంను సమతుల్యం చేయడానికి తేలికగా ఉంటుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటుకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద మూలిక. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాలు కలుపుకొని తాగాలని సిఫార్సు చేస్తున్నారు.
2. ఉసిరి
ఉసిరికాయ ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణకు ఇది ఉత్తమమైన పండు. శీతాకాలంలో ఖాళీ కడుపుతో ఉసిరిని పండును నేరుగా అయినా లేదా రసం రూపంలో తీసుకోండి. హైబీపీ కంట్రోల్ అయిపోతుంది. ఉసిరిని నిల్వ చేసుకొని పొడి లేదా టాబ్లెట్ రూపంలో ఇతర సీజన్లలో కూడా తీసుకోవచ్చు.
3. వెల్లుల్లి
వెల్లుల్లిలో వాత-కఫాలను తగ్గించే గుణాలు ఉన్నాయి, కాబట్టి ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడే ఒక సహజమైన యాంటీ-హైపర్‌టెన్సివ్ హెర్బ్. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 1-2 వెల్లుల్లి రెబ్బలు నమలండి. లేదా నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు.
4. బ్లాక్ రైసిన్లు
వీటిలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్పాహారానికి 25-30 నిమిషాల ముందు రాత్రిపూట నానబెట్టిన ఎండుద్రాక్షలను 5-7 తీసుకోండి. అధిక రక్తపోటు నియంత్రణతో పాటు మరెన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
5. అర్జున్ టీ
అర్జున టీ హైబీపీని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారం. ఈ టీని అర్జున్ బెరడు, అశ్వగంధ, బ్రాహ్మి, శంఖపుష్పి, పునర్నవ, పిపాల్ త్వాక్, దాల్చిన చెక్క మొదలైన మూలికలతో కలిపి తయారు చేస్తారు. నిద్రించేటపుడు అర్జున టీ తాగడం వలన అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు ఉండదు. రాత్రి భోజనం చేసిన ఒకటిన్నర గంటల తర్వాత, ప్రతిరోజూ రాత్రి 9:30 గంటల సమయానికి ఈ టీని తాగండి. 1 కప్పు పాలు , 1 కప్పు నీటిలో, 1 టీస్పూన్ అర్జున్ బెరడు పొడిని వేసి మరిగించాలి. పాలు ఉడకడం ప్రారంభించినప్పుడు, దానికి చిటికెడు దాల్చినచెక్క, అర టీస్పూన్ పసుపు, మిరియాలు మొదలైనవి వేసి మరిగించి ఆ తర్వాత ఫిల్టర్ చేసి సిప్ బై సిప్ తాగాలి.
సంబంధిత కథనం