తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neck Pain From Yoga: యోగాతో మెడ నొప్పి వస్తోందా? ఇలా ఉపశమనం పొందండి

Neck pain from yoga: యోగాతో మెడ నొప్పి వస్తోందా? ఇలా ఉపశమనం పొందండి

HT Telugu Desk HT Telugu

17 February 2023, 10:16 IST

    • Neck pain from yoga: యోగాలో మెడ నొప్పి రాకుండా ఉండేందుకు నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇక్కడ చూడండి.
యోగాలో మెడ నొప్పి రాకుండా చిట్కాలు
యోగాలో మెడ నొప్పి రాకుండా చిట్కాలు (pexels)

యోగాలో మెడ నొప్పి రాకుండా చిట్కాలు

యోగా వల్ల మెడ నొప్పి రావడం సర్వసాధారణం. ముఖ్యంగా మీకు ప్రాక్టీస్ లేకపోయినా, కొన్ని ఆసనాలు సరైన భంగిమల్లో వేయలేకపోయినా ఈ సమస్య రావొచ్చు. లేదా రోజువారీ అభ్యాసాల్లో కదలికల్లో లోపం, భంగిమ సరిగ్గా లేకపోవడం, మీ తలను సరైన స్థితిలో ఉంచకపోవడం వంటి వాటి వల్ల మెడ నొప్పి రావొచ్చు. మెడ ప్రాంతంలో అసౌకర్యంగా ఉండడం సర్వసాధారణం. ఈ నొప్పి మీ భుజాలకు, వెన్ను ప్రాంతంలోకి కూడా వ్యాపించవచ్చు. ఒక్కోసారి తలనొప్పి కూడా వస్తుంది.

యోగా మాస్టార్, ఆధ్యాత్మిక గురు, లైఫ్‌స్టైల్ కోచ్ హిమాలయన్ సిద్ధా అక్షర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై మాట్లాడారు. మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలు సూచించారు.

1. యోగా సంబంధిత వార్మప్ చేయడం

యోగాసనాలకు ముందు సూక్ష్మ వ్యాయామం, లేదా తేలికపాటి వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి. మీ నడుము భాగం, చేతులు, మణికట్టు, తల, మెడ, కాలి మడమలు వార్మప్ అయ్యేలా నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండాలి. కొద్దిసేపు వేగంగా నడుస్తూ మీ కండరాలు స్ట్రెచ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మీ శరీరం యోగాసనాలకు సిద్ధమవుతుంది. ఎలాంటి నొప్పులూ ఉండవు. యోగా భంగిమలకు ముందు వార్మప్ చేయడం వల్ల ఒంటె భంగిమ, పాము భంగిమ వంటి వాటిలో మీరు వంగినా నొప్పి రాకుండా ఉంటుంది.

2. తలకు తగిన విశ్రాంతి

మీరు తలను నేలపై ఆనించాల్సి వచ్చినప్పుడు సపోర్ట్‌గా మీ అరచేతులను ఉంచి వాటికి మీ తలను ఆనిస్తూ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

3. విలోమాలను సురక్షితంగా ప్రాక్టీస్ చేయండి

శీర్షాసనం వేస్తున్నప్పుడు మీ ముంజేతులు, మోచేతులు నేలవైపుకు తిప్పాలి. మీ తలపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోండి. మీ తల తరచుగా కదలకుండా చూసుకోండి.

4. క్రమం తప్పకుండా స్ట్రెచ్ చేయండి

రోజూ యోగా చేస్తున్నప్పుడు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండండి. దీని వల్ల భుజాలు, మెడలో దృఢత్వం తగ్గి సౌకర్యవంతంగా ఉంటుంది.

5. యోగాసనాలు

యోగాసనాల్లో మెడ నొప్పి నివారణకు కొన్ని ప్రత్యేక భంగిమలు ఉన్నాయి. మీ శరీర సామర్థ్యానికి అనుగుణంగా ఆయా భంగిమల్లో యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి.

ఒంటె భంగిమ

నేలపై లేదా యోగా మ్యాట్‌ మీద మోకాళ్లపై నిల్చుని ఉండండి. మీ చేతులు తుంటి భాగంలో ఉంచండి. ఇప్పుడు మీ నడుమును క్రమంగా వెనక్కి వంచుతూ చేతులను చీలమండలవైపు తీసుకురండి. చేతులను నిటారుగా ఉంచి చీలమండల పక్కకు తీసుకురండి. మీ మెడపై ఎలాంటి ఒత్తిడి పెట్టకండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ప్రారంభ భంగిమకు రండి.

సర్పాసనం

మీ పొట్టపై పడుకోండి. మీ చేతులను మీ వెనక భాగంలోకి తెచ్చి రెండింటిని కలిపి పట్టుకోండి. ఇప్పుడు శ్వాస గట్టిగా పీల్చండి. కొన్ని సెకెండ్లు అలాగే ఉండండి. నెమ్మదిగా మీ తలను, భుజాలను, ఛాతీని వీలైనంత మేర లేపుతూ ఉండండి. మీ పాదాలు నేలపైనే ఉండేలా చూడండి. 10సార్లు శ్వాస తీసుకునేంత వరకు అలాగే ఉండండి.

6. గాడ్జెట్స్‌కు దూరంగా ఉండండి

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటి గాడ్జెట్లకు దూరంగా ఉండడం మంచిది. మీరు నడుస్తున్నప్పుడు కూడా గాడ్జెట్లు వాడుతుండడం గమనించే ఉంటారు. ప్రస్తుత జీవనశైలి అలా తయారైంది. ఓ అధ్యయనం ప్రకారం జనం రోజూ 4 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోతున్నారట. అంటే సంవత్సరానికి 1400 గంటలు అలా స్మార్ట్‌ఫోన్లతో గడిపేస్తున్నారు. అంత అవసరం లేదు. సుదీర్ఘంగా కుర్చీకి పరిమితమవడం, అనారోగ్య జీవనశైలి, సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల మెడలో స్టిఫ్‌నెస్‌కు దారి తీసి మెడ నొప్పి, భుజాల నొప్పి వస్తుంది.

అలాగే రోజువారీ పనుల్లో ఎదురవుతున్న ఒత్తిడి కూడా మెడ నొప్పి, భుజాల నొప్పి, వెన్ను నొప్పికి కారణమవుతోంది. ప్రతికూల శక్తి ఈ భాగాల్లో కేంద్రీకృతమవడమే ఇందుకు కారణం. తేలికపాటి యోగాసనాలతో, శ్వాస వ్యాయామాలు, ధ్యానంతో ఈ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

టాపిక్