Brisk Walking | చురుకైన నడకతో గుండెపోటును నివారించవచ్చు, కానీ ఆ ఒక్కటి ముఖ్యం!-a simple brisk walking can also decrease risk of sudden heart attack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brisk Walking | చురుకైన నడకతో గుండెపోటును నివారించవచ్చు, కానీ ఆ ఒక్కటి ముఖ్యం!

Brisk Walking | చురుకైన నడకతో గుండెపోటును నివారించవచ్చు, కానీ ఆ ఒక్కటి ముఖ్యం!

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 07:30 PM IST

Brisk Walking- Heart Health: వారానికి కనీసం 5 రోజుల బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండెపోటును నివారించడంతో పాటు లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు, అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

Brisk Walking- Heart Health|
Brisk Walking- Heart Health| (iStock)

Brisk Walking- Heart Health: గుండెపోటుతో కలిగే మరణాల రేటు రోజురోజుకూ భయాందోళనకు గురి చేస్తోంది. నిన్నమొన్నటి వరకు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న వ్యక్తులు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఈరోజుల్లో గుండెపోటు ఏ వయసు వారికైనా వస్తుంది. చిన్న వయసులో కూడా గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ ఆకస్మిక గుండెపోట్ల నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడమే మార్గం అని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉండటం ఇందులో ముఖ్యమైన దశ. అంటే నిశ్చలమైన జీవనశైలిని కలిగి ఉండకుండా శరీరానికి కాస్త శ్రమ కల్పించాలి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

అయితే వ్యాయామం కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. కేవలం మితమైన వ్యాయామం చాలు. రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు వారానికి కనీసం 5 రోజులు 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చురుకైన నడకకు వెళ్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు గుండెపోటు రాకుండా నిరోధించవచ్చునని చెబుతున్నారు.

చురుకైన నడక అంటే ఏమిటి?

చురుకైన నడక అంటే మన సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవడం. కచ్చితంగా చెప్పాలంటే 60 సెకన్లలో 100 అడుగులు నడవాలి. ఇందుకోసం మీరు స్మార్ట్ వాచ్, స్టెప్ కౌంటర్ యాప్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది లెక్కింపును సులభతరం చేస్తుంది. అయితే ఈ చురుకైన నడకలో మీరు మాట్లాడగలరో లేదో తనిఖీ చేయండి. మీరు ఊపిరి పీల్చుకుని, హాయిగా మాట్లాడగలిగితే, మీరు చురుకైన నడకను చేస్తున్నట్లే.

ఈ తప్పులు చేయవద్దు

ప్రజలు చురుకైన నడకను సాధారణ నడకగా భావిస్తారు. చురుకైన నడక లక్ష్యం హృదయ స్పందన రేటు అని గుర్తుంచుకోండి. మీ వేగం అవసరం కంటే తక్కువగా ఉంటే, అది పెద్దగా ఉపయోగపడదు. మరోవైపు, మీ వేగం చాలా ఎక్కువగా ఉంటే, అది మరిన్ని సమస్య లను కలిగించవచ్చు. కాబట్టి మరీ నెమ్మదిగా కాకుండా, మరీ వేగంగా కాకుండా నడవాలి. చురుకైన నడకకు వెళ్లినపుడు సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించండి. మంచి బూట్లు ధరించండి. లేదంటే పాదాల కండరాలలో సమస్య వస్తుంది.

చురుకైన నడక ప్రయోజనాలు

వారానికి కనీసం 5 రోజుల బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండెపోటును నివారించడంతో పాటు లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ అదనపు బరువును తగ్గిస్తుంది. మీ కేలరీలు బర్న్ చేస్తుంది, లీన్ కండరాలు పెరుగుతాయి. నడక మీ మానసిక స్థితిని సరిగ్గా ఉంచుతుంది. చురుకైన నడక మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది.

Whats_app_banner