తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moringa Tea । మునగాకు టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు!

Moringa Tea । మునగాకు టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు!

HT Telugu Desk HT Telugu

22 March 2023, 18:16 IST

  • Moringa Tea: మునగాకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే మునగాకు టీ తాగడం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చునని అంటున్నారు. మునగాకు టీ ఎలా చేసుకోవాలో చూడండి.

Moringa Tea
Moringa Tea (Pixabay)

Moringa Tea

Tea Time: సాధారణంగా మునగకాయలను వంటలలో ఉపయోగిస్తాం. సాంబారు చేయడానికి, కూర వండటానికి మునక్కాడలు మనకు విరివిగా లభించే ఒక వెజిటెబుల్. అయితే వివిధ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మునగాకులను కూడా ఆహారంగా, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో మునగాకు టీ చాలా ప్రజాదరణ పొందుతోంది. మునగ చెట్టు ఆకులను ఉపయోగించి తయారు చేసే టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

శరీరంలోని కొవ్వు, కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడం ద్వారా మోరింగా టీ బరువు తగ్గడంలో సహాయపడుతుందని తేలింది. మోరింగా టీ లేదా మునగాకు టీ తాగితే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపడుతుంది.

మునగాకు టీ తాగేవారిలో రక్తపోటు స్థాయిలు నియంత్రణలోకి వచ్చినట్లు అధ్యయనాలు తెలిపాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా మునగాకులోని యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు ప్రభావం చూపుతున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు మునగాకు టీ తాగడం ద్వారా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పొందడానికి, కంటిచూపు మెరగుపడటానికి కూడా సహయపడతాయని అంటున్నారు.

How To Make Moringa Tea- మునగాకు టీని ఎలా తయారు చేయాలి?

మోరింగ పౌడర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ పొడిని టీ లేదా కాఫీ చేసుకోవచ్చు. మోరింగా టీ పొడిని నీటిలో వేసి మరిగించి ఆపై ఫిల్టర్ చేయడం ద్వారా ప్రకాశవంతమైన గ్రీన్ టీ లాగా తయారవుతుంది.

అయితే మీరు మార్కెట్లో లభించే మోరింగ పౌడర్‌లను విశ్వసించకపోతే, మీకు మీరుగా ఇంట్లోనే మోరింగా పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా కొన్ని మునగ చెట్టు నుంచి కొన్ని తాజా మునగాకులను తీసుకోండి, వాటిని శుభ్రంగా కడిగి, ఆపై ఎండలో ఎండబెట్టండి. అనంతరం ఎండిన ఆకులను మెత్తగా పొడిగా చేయండి. లేదా మీరు తాజా ఆకులను శుభ్రం చేసి కొన్ని నిమిషాలు నీటిలో ఉడకబెట్టి కూడా మునగాకు టీ తయారు చేసుకోవచ్చు. (Also Read: Dengaku Recipe కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గమనిక: మీకు ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మునగాకు టీ తాగడానికి ముందుగా మీ వైద్యులను సంప్రదించండి.