Matcha Tea । జపాన్ గ్రీన్ టీ మాచా.. ఆరోగ్యానికి ఇది సూపర్ మచ్చా!
Matcha Tea Health Benefits: జపనీస్ పద్దతిలో చేసే గ్రీన్ టీని మాచా అని పిలుస్తారు. ఈ టీ ఎలా చేయాలి? దీనిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ఇక్కడ తెలుసుకోండి.

Matcha: మాచా అనేది జపనీస్ గ్రీన్ టీ. సాధారణంగా టీ ఆకులను వేడి నీటిలో ముంచి తయారుచేసే సాంప్రదాయ గ్రీన్ టీలా కాకుండా, ఎండిన గ్రీన్ టీ ఆకులను పొడి రూపంలో రుబ్బి దీనిని తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన టీ రకం ప్రజాదరణ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. మీరు గ్రీన్ టీ రుచిని ఇష్టపడకపోతే, మాచా పానీయాన్ని తాగవచ్చు. ఎందుకంటే, మీకు గ్రీన్ టీ తాగడం వలన లభించే ప్రయోజనాలన్నింటిని మాచా నుండి కూడా పొందవచ్చు, మాచా కూడా ఒక గాఢమైన గ్రీన్ టీ. ఇది కూడా కొద్దిగా చేదు ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఆకుపచ్చని రంగులో గ్రీన్ టీకి మరొక ఫ్లేవర్‌గా ఉంటుంది.
ఈ మాచాను టీ లేదా కాఫీ రూపంలోనే కాకుండా స్వీట్ డెజర్ట్‌ల రూపంలో కూడా తీసుకుంటున్నారు. అయితే మాచా పానీయాన్ని ఇంట్లో కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఎలా చేయాలో మాచా రెసిపీ ఈ కింద ఉంది చూడండి.
How To Make Matcha- మాచా టీ తయారీ
కావలసినవి:
- 1/2 టీస్పూన్ మాచా గ్రీన్ టీ పొడి
- 1/4 కప్పు చల్లని నీరు
- 1/2 కప్పు వేడి నీరు
- 1 టీస్పూన్ తేనె లేదా మాపుల్ సిరప్ లేదా చక్కెర (ఐచ్ఛికం)
తయారీ విధానం:
- మాచా పొడిని ఒక కప్పులో చేసి, కొన్ని చల్లటి నీటిని చిలకరించి పేస్ట్‌గా చేయాలి. ఆపైన మిగిలిన చల్లటి నీటిని వేసి నురుగు వచ్చేలా బాగా కలపాలి. ఇప్పుడు ఒక కప్పులో వేడినీరు తీసుకొని అందులో చక్కెర వేసి కలపండి, ఆపై ఈ వేడి చక్కెర నీటిని నురగ వచ్చిన మాచా మిశ్రమంలో కలపండి. అంతే మాచా టీ రెడీ.
Matcha Tea Health Benefits- మాచా టీ'తో ఆరోగ్య ప్రయోజనాలు
మాచా తాగడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు అందుతాయని ప్రచారం ఉంది. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
- మాచాలో క్యాటెచిన్‌లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి సహజ యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్‌లను స్థిరీకరించడంలో సహాయపడతాయి.
- అంతర్గత ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. కెఫిన్, EGCG మరియు గ్రీన్ టీ వంటి సమ్మేళనాలను కలిగి ఉన్న మాచా పౌడర్ మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి.
- మాచాలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రత్యేకించి ఎపిగాల్లోకాటెచిన్-3-గాలేట్ (EGCG) సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి హృదయ ఆరోగ్యం, జీవక్రియపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి.
- జపనీస్ మాచా సాంప్రదాయకంగా అధిక మొత్తంలో అమైనో ఆమ్లం L-థియనైన్, తక్కువ స్థాయి కెఫిన్, ఎక్కువ కాటెచిన్‌లను కలిగి ఉంది. కావున ఈ పానీయం ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ప్రభావాలు కనబరుస్తుంది. తద్వారా డిప్రెషన్ తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది.
- మాచాలోని పాలీఫెనాల్స్ మెదడు పనితీరును పెంచుతాయి.మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- మాచాపై ఆరోగ్య ప్రయోజనాలను నిర్ధారించే పరిశోధనలు తక్కువ. దీనిపై మరింత విస్తృత అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.
సంబంధిత కథనం