DIY Rosemary Water । ఒత్తైన జుట్టుకు, మెరుగైన జ్ఞాపకశక్తికి రోజ్మరీ వాటర్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు!
DIY Rosemary Water- జుట్టు పెరగటం నుంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచటం వరకు రోజ్మరీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజ్మరీ వాటర్ ఎలా తయారు చేయవచ్చో డెర్మటాలజిస్టులు సూచించిన విధానం ఇక్కడ చూడండి.
చర్మ సంరక్షణ కోసం, సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా రోజ్మేరీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్‌ను ఉపయోగించే ట్రెండ్ ఫాలో అవుతున్నారు సౌందర్య పోషకులు. రోజ్మరీ అనేది ఆహారంలో ఫ్లేవర్ కోసం అలాగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక సుగంధ మూలిక.
జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి రోజ్మేరీ వాటర్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు తమ షాంపూలలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలుపుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇది స్కాల్ప్ ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది హెయిర్ ఫోలికల్స్‌కు రక్త సరఫరాను ప్రేరేపించడానికి, జుట్టును బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు చివర్లు చీలిపోవడం, చుండ్రును నియంత్రణలోకి తీసుకురావడం వంటి ఇతర జుట్టు సమస్యలకు సహాయపడుతుంది.
ఈ రోజ్మేరీ దాని ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి. దీనిని ఆయుర్వేదంలో రుజామారి అని పిలుస్తారు. రోజ్మేరీ మరిన్ని ప్రయోజనాల గురించి నిపుణులు వివరించారు. రోజ్మరీ కేవలం జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అభిజ్ఞా ఉద్దీపనగా కూడా పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా వ్యక్తుల్లో చురుకుదనం, తెలివితేటలు, ఏకాగ్రత పెరుగుతుందట. దీర్ఘకాలిక ఆందోళనలు, ఒత్తిడి హార్మోన్ అసమతుల్యతతో బాధపడుతున్న వారికి రోజ్మరీ మూలిక ప్రయోజనకరంగా ఉంటుంది.
DIY Rosemary Water- రోజ్మరీ వాటర్‌ను ఎలా వాడాలి
రోజ్మరీ ఇన్ఫ్యూజ్ చేసిన నీటిని మీ తలపై స్ప్రే చేయడంతో పాటు, మీరు రోజ్మేరీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్‌ను మీ జుట్టుకు అప్లై చేసి, కనీసం అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ప్రత్యామ్నాయంగా, రోజ్మేరీ టీ తాగడం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీ షాంపూలో రోజ్మరీ హెర్బ్ ఆయిల్ కొన్ని చుక్కలను సరిగ్గా ఎమల్సిఫై చేసి, దానితో మీ జుట్టును కడగడం వలన అనేక జుట్టు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.
DIY రోజ్మేరీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎలా తయారు చేయవచ్చో అష్యూర్ క్లినిక్ డెర్మటాలజిస్ట్ (MD) డాక్టర్ అభిషేక్ పిలానీ సూచనలు చేశారు. ఆయన ప్రకారం, కొన్ని రెమ్మల రోజ్మేరీ ఆకులను తీసుకోండి, వాటిని 2 కప్పుల నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించండి, ఆపైన నీటిని చల్లబరిచి స్ప్రే బాటిల్‌లో నింపండి. ఈ మూలికా నీటిని మీ తలకు అప్లై చేయాలి. రాత్రిపూట తలకు స్ప్రే చేసి అలాగే వదిలేయడం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అయితే తలకు స్ప్రే చేసుకునే ముందు తల శుభ్రంగా ఉండాలని డాక్టర్ అభిషేక్ తెలిపారు.
రోజ్మరీ ఇన్ఫ్యూజ్ చేసిన నీటిని మీ తలపై స్ప్రే చేయడంతో పాటు, రోజ్మేరీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్‌ను మీ జుట్టుకు అప్లై చేసి, కనీసం అరగంట పాటు అలాగే ఉంచి ఆపైన జుట్టును కడుక్కోవాలి.
Rosemary Water Usage Precautions- జాగ్రత్తలు
మీరు రోజ్మేరీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లేదా ఎసెన్షియల్ ఆయిల్‌లను ఉపయోగించాలనుకుంటే దానికి మీ చర్మం ఎలా ప్రతిస్త్పందిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఏదైనా రకమైన బర్నింగ్ సెన్సేషన్, చికాకు లేదా దద్దర్లు కలిగితే దాన్ని ఉపయోగించడం మానేయండి.
అయితే రోజ్మరీ స్వచ్ఛమైన రూపాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అని డాక్టర్ అభిషేక్ అన్నారు. అందుకే ఎల్లప్పుడూ సహజమైన లేదా మొక్కల ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించమని సలహా ఇస్తున్నారు.
అదనంగా గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించడానికి ముందు మీ వైద్యుల సలహా తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు
సంబంధిత కథనం