DIY Shampoo । మీ షాంపూతో జుట్టు రాలుతోందా? సహజంగా ఇంట్లోనే చేసుకోండి ఇలా!
DIY Shampoo: జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మీరు ఇప్పటివరకు వివిధ రకాల షాంపూలు లేదా నూనెలను ఉపయోగించినా ఫలితం కనిపించడం లేదంటే, మీ జుట్టుకు ప్రత్యేక సంరక్షణ అవసరం. ఇంట్లోనే సహజంగా ఇలా షాంపూ తయారు చేసుకొని వాడి చూడండి.
DIY Shampoo: ఇప్పుడు జుట్టు సంరక్షణ కోసం ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. జుట్టు రాలడం అరికట్టడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, చుండ్రును నివారించడానికి, తెల్ల జుట్టును నల్లబరచడానికి, జుట్టు మెరిసేలా తయారవడానికి ఇలా ఒక్కో అవసరానికి తగ్గట్లుగా కేశ సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇందులో ఏదైనా ఉత్పత్తిని ఒక ప్రయోజనం కోసం వాడితే దానికి అనుబంధంగా మరొక సమస్య తలెత్తుతుంది. చుండ్రును నివారించడానికి ఒక షాంపూ వాడితే దానితో జుట్టు నెరిసే అవకాశం ఉండవచ్చు, తెల్లజుట్టును నల్లబరుచుకుందామనుకుంటే ఉన్న జుట్టు ఊడిపోవచ్చు. కారణం వాటిల్లో ఉపయోగించే రసాయన పదార్థాలే. చాలా మంది జుట్టు రాలడానికి కారణం తాము ఉపయోగించే షాంపూనే అని భావిస్తారు.
మీరు ఉపయోగించే షాంపూతో కూడా జుట్టు రాలుతోందా? ఎన్ని రకాల షాంపూలు మార్చినా ఉపయోగం లేదా? అయితే రసాయనాలు లేని షాంపూను మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. సహజమైన షాంపూ మీ వెంట్రుకలపై కఠినంగా ఉండదు, దీనితో జుట్టుకు పోషణ కూడా లభిస్తుంది.
షాంపూని ప్రత్యేకంగా స్టోర్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవచ్చో DIY విధానం ఇక్కడ తెలుసుకోండి. ఈ ప్రత్యేక షాంపూ చేయటానికి మీకు కొన్ని కుంకుడుకాయలు, మందార పూలు అవసరం అవుతాయి.
DIY Shampoo - షాంపూ తయారు చేసే విధానం
కుంకుడు కాయలను ఒక రాత్రి పూర్తిగా నీళ్లలో నానబెట్టండి. ఆ తరువాత, ఉదయం వాటిని ఒలిచి విత్తనాలను తొలగించండి. ఇప్పుడు ఈ నానబెట్టిన కుంకుడు కాయలను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
అలాగే కొన్ని మందార పువ్వులను సేకరించి వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు పేస్టులను బాగా కలిపేయండి. మీ షాంపూ సిద్ధమైనట్లే. ఈ మిశ్రమాన్ని షాంపూలా వాడండి. దీనికి కొంచెం నురగ తక్కువగా రావచ్చు, అయినప్పటికీ దీనితో తల పరిశుభ్రం అవుతుంది.
ఈ సహజమైన షాంపూని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మీరు కేవలం కొన్ని రోజుల్లోనే ఫలితాలను చూడవచ్చు. అయితే, మీకు ఏవైనా చర్మ సమస్యలు లేదా సున్నితత్వం ఉంటే ముందుగా చర్మవ్యాధి నిపుణులు, ఆయుర్వేద నిపుణులతో చర్చించి ముందుకు వెళ్ళడం ఉత్తమం.
Shampooing Tips- షాంపూ వర్తించడంలో చిట్కాలు
- ఏ షాంపూనైనా నేరుగా జుట్టుపై వర్తించడం వలన, కొద్దిమొత్తంలో జుట్టులో పేరుకుపోవచ్చు, అది ఎండిపోయినపుడు జుట్టు రాలడానికి దారితీస్తుంది.
- మీ జుట్టును షాంపూ చేయడానికి, ముందుగా జుట్టును నీటితో బాగా తడపండి. ఆపై పావు కప్పు నీళ్లలో షాంపూ వేసి బాగా కలపాలి. ఇలా పలుచన చేసిన షాంపూ ద్రావణాన్ని జుట్టుకు అప్లై చేసి రుద్దుకోవాలి.
- షాంపూ చేసుకునేటపుడు మీ స్కాల్ప్‌ను గట్టిగా రుద్దకండి. నెమ్మదిగా మీ వేళ్లతో మసాజ్ చేయండి.
- రోజూ షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా, జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది ఆ తర్వాత రాలిపోతుంది. వారానికి రెండు, మూడు సార్లకు మించి షాంపూ చేసుకోకూడదు.
- మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూని ఉపయోగించండి. దీని కోసం మీరు హెర్బల్ లేదా ఏదైనా ఆయుర్వేద షాంపూని ఉపయోగించవచ్చు.
- కండీషనర్‌ను ఎల్లప్పుడూ జుట్టు అంచులకు అప్లై చేయాలి. జుట్టు మూలాలపై ఎప్పుడూ ఉపయోగించవద్దు. అలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోతుంది. మీ జుట్టుకు పైపైన కండీషనర్‌ను సున్నితంగా అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత తలస్నానం చేయండి.
సంబంధిత కథనం