DIY Onion Hair Oil । ఉల్లినూనెతో మీ జుట్టుకు జీవకళ.. మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు ఇలా!-from hair growth to treating scalp infections know benefits of onion hair oil check diy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  From Hair Growth To Treating Scalp Infections Know Benefits Of Onion Hair Oil, Check Diy Recipe

DIY Onion Hair Oil । ఉల్లినూనెతో మీ జుట్టుకు జీవకళ.. మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు ఇలా!

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 05:35 PM IST

DIY Onion Hair Oil-ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు మీరుగా ఇంట్లోనే ఉల్లినూనెను చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.

DIY Onion Hair Oil
DIY Onion Hair Oil (istock)

ఉల్లి చేసే మేలు చాలా రకాలు, సాధారణంగా ఉల్లిపాయను మనం ఆహారంలో కలుపుకొని తింటాం. అయితే ఇప్పుడు పలు సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉల్లిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదల కోసం ఉల్లి షాంపూలు, ఉల్లినూనెలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఉల్లిపాయ నూనె జుట్టు సంరక్షణ కోసం బహుళ ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు అంటున్నారు.

ఉల్లిపాయ నుండి సేకరించిన సహజ నూనెలో విటమిన్లు ఎ, సి, ఇ లతో పాటు వివిధ బి-కాంప్లెక్స్ విటమిన్లు, అలాగే సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ప్రయోజనకరమైన ఖనిజాలు లభిస్తాయి. ఇవి జుట్టు తంతువులకు పోషణ అందించే కెరాటిన్, ప్రోటీన్ వంటి పోషకాల ఉత్పత్తికి చాలా అవసరమైనవి.

ఉల్లినూనెలో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన ఫ్లేవనాయిడ్ కూడా ఉంటుంది, ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, జుట్టు దెబ్బతినకుండా కాపాడటానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ నూనెను తలకు రాసుకుంటే జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. అంతేకాదు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు, వివిధ చర్మ సమస్యలకు సహజ నివారణగా కూడా ఉపయోగించవచ్చునని చెబుతారు.

అయితే ఉల్లినూనెను ఎక్కువ ఖర్చు చేసి కొనవలసిన అవసరం లేదు. మీకు మీరుగా (DIY) మీ ఇంట్లోనే సొంతంగా ఉల్లిపాయ నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయవచో ఇక్కడ చూడండి.

DIY Onion Hair Oil- హోమ్ మేడ్ ఉల్లినూనె ఇలా చేయండి

కావలసినవి:

  • 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు
  • 1/2 కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె

తయారీ విధానం:

- ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.

- అనంతరం ఒక బాణలిలో మీడియం వేడి మీద కొబ్బరినూనెను వేడి చేయండి.

- అందులో తరిగిన ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా కలపాలి.

- తక్కువ వేడి మీద ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేడిచేయండి. ఆపై స్టవ్ ఆఫ్ చేయండి.

ఇప్పుడు ఈ నూనె చల్లబడిన తర్వాత, ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేయండి. కొన్ని వారాల పాటు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు

ఉల్లినూనెను ఎలా ఉపయోగించాలి?

మీరు తయారు చేసుకున్న ఉల్లిపాయ నూనెను చిన్న మొత్తంలో తీసుకొని మీ తలకు పట్టించి, వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి. దీనిని కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. అనంతరం తేలికపాటి షాంపూ, కండీషనర్‌తో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ నూనె తలకు వర్తించినపుడు, దానిని కడిగిన తర్వాత కూడా ఆ వాసనపోదు. కాబట్టి మీరు రాత్రిపూట నిద్రవేళకు ముందు పెట్టుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం