Onion Juice For Hair Care । ఉల్లిరసం అన్ని రకాల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారం!
Onion Juice For Hair Care: ఉల్లిరసం వెంట్రుకల సంరక్షణకు ఒక వరం. ఉల్లిరసం జుట్టుకు ఏవిధమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
ఉల్లిపాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలు చేస్తాయి. జుట్టు సంరక్షణకు ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవల కాలంలో ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూలను బాగా ప్రచారం చేస్తున్నారు, మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఉల్లిపాయల్లో జింక్, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియంలతో పాటు బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.
ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనం శరీరంలో కేటలేస్ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు కారణమయ్యే ఎంజైమ్, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు తెల్లబడకుండా కూడా కాపాడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేసింది. ఉల్లిపాయలలోని పోషకాలతో చాలా జుట్టు సమస్యలను నయం చేయవచ్చు. అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలను కూడా నశింపజేస్తాయి. తద్వారా చుండ్రు సమస్యకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు.
చుండ్రు పోవాలంటే
ఆరు చెంచాల ఉల్లిపాయ రసానికి రెండు చెంచాల పెరుగు కలిపి జుట్టుకు, స్కాల్ప్ కు పట్టించి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే చుండ్రు, ఇతర సమస్యలు దూరమవుతాయి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి జుట్టును స్మూత్‌గా మార్చుతుంది. సెబమ్ స్థాయిలను నియంత్రిస్తుంది, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తుగా ఉండే జుట్టు కోసం
నాలుగు నుంచి ఐదు చెంచాల ఉల్లిపాయ రసంలో రెండు చెంచాల పటిక కలపండి, ఈ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయండి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని రిసినోలిక్ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
సిల్కీ జుట్టు కోసం
రెండు చెంచాల ఉల్లిపాయ రసానికి ఒక చెంచా తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీగా కూడా మారుతుంది.
బలమైన జుట్టు కుదుళ్ల కోసం
ఒక గిన్నెలో గుడ్డును గిలక్కొట్టండి. అందులో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 3 చుక్కల టీ-ట్రీ ఆయిల్ వేసి బాగా కలపండి. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మూలాలు బలంగా మారుతాయి.
జుట్టు రాలడాన్ని తగ్గించడం
అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసి వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట తర్వాత జుట్టు కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టు తెల్లబడకుండా
ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి, ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ ఉల్లిపాయ రసంలో కొన్ని ఎండిన కరివేపాకులను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు నెరసిపోవడం, తెల్లబడటం తగ్గుతుంది.
ఉల్లిపాయ నూనె ఎలా తయారు చేయాలి
ఒక గిన్నెలో రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 4-5 స్పూన్ల కొబ్బరి నూనె వేసి చిన్న మంటపై వేడి చేయండి. నూనె రంగు మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని జల్లెడలో ఫిల్టర్ చేసి, నిల్వ చేయండి.
సంబంధిత కథనం