White Onions vs Red Onions । ఉల్లిపాయలలో ఎర్రగడ్డలు మంచివా.. తెల్లవి ఆరోగ్యకరమా?
White Onions vs Red Onions: మన వద్ద లభించే ఉల్లిపాయలు రెండు రకాలు, ఒకటి ఎర్రగడ్డ ఇంకొకటి తెల్లగడ్డ. ఈ ఎర్ర ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలలో ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది? ఇక్కడ తెలుసుకోండి.
White Onions vs Red Onions: మన భారతీయ వంటలలో ఉల్లిపాయ లేకుండా చేసే వంటకం అంటూ దాదాపు ఉండదు. ప్రతి కూరలో ఉల్లిపాయ ఉపయోగిస్తాం. కొందరు పచ్చివి కూడా తింటారు. అయితే కొందరికి దీని వాసన నచ్చక ఉల్లిని తినడానికి ఇష్టపడరు. కానీ ఉల్లి చేసే మేలు.. ఆ మిగతా సగం చెప్పాల్సిన అవసరం లేదు. పాపం ఉల్లిపాయను మీరు ముక్కలు ముక్కలుగా కోసినప్పుడు, వద్దూ అని చెప్పటానికి అది మీకు కన్నీళ్లు తెప్పించినప్పటికీ, ఉల్లిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే మార్కెట్లో మనకు రెండు రకాల ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయి. కొన్ని చోట్ల ఎర్రగడ్డలు అని పిలిచే ఎర్ర ఉల్లిపాయలు (Red Onions) లభిస్తే, మరికొన్ని చోట్ల తెల్ల ఉల్లిపాయలు మాత్రమే లభిస్తాయి. కొన్నికొన్ని చోట్ల ఈ రెండు రకాలు అందుబాటులో ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏ రకం ఉల్లిపాయలు మంచివి అంటే, తెల్లవే అని చెబుతున్నారు.
పోషకాల గని
తెల్ల ఉల్లిపాయను పోషకాల గనిగా చెప్పుకోవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. సాధారణ పరిమాణంలో ఉండే ఒక ఉల్లిపాయలో కేవలం 44 కేలరీలు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి.
విటమిన్ సి
తెల్ల ఉల్లిపాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, కణజాల మరమ్మత్తుకు, దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడానికి, శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, తెల్ల ఉల్లిపాయలలో విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
మెరుగైన జీవక్రియ
తెల్ల ఉల్లిపాయ చలువ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర మంటను తగ్గిస్తుంది. అలాగే తెల్ల ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి మన కడుపుకు మేలు చేస్తాయి, మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
షుగర్ సమస్యకు పరిష్కారం
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక ముఖ్యమైన ఔషధం. ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంటే గుండెలో పేరుకుపోయే కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయలలోని గుణాలు అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.
క్యాన్సర్ నివారణకు
క్యాన్సర్‌కు సరైన చికిత్స లేనప్పటికీ, తెల్ల ఉల్లిపాయ క్యాన్సర్ లక్షణాలను నివారించడంలో మేలు చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. తెల్ల ఉల్లిపాయల్లో క్యాన్సర్‌తో పోరాడే ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
మరోవైపు ఎర్ర ఉల్లిపాయల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ మూలకం తెల్ల ఉల్లిపాయల్లో కనిపించదు. ఎర్ర ఉల్లిపాయల్లోనూ పైన చెప్పిన పోషకాలు కొద్ది మోతాదులో ఉంటాయి. కాబట్టి, చివరగా చెప్పేదేమిటంటే.. ఉల్లిపాయలను తినండి. అవి ఎర్రవైనా, తెల్లవైవా. కొన్నిసార్లు ఎర్రవి, కొన్నిసార్లు తెల్లవి ప్రయత్నించండి.
సంబంధిత కథనం