Skin and Hair Care in Winter : చలికాలంలో చర్మాన్ని, జుట్టును సహజంగా హైడ్రేట్​ చేయాలంటే.. ఇవే బెస్ట్-easy kitchen ingredients to add to your beauty routine this winter for hair and skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin And Hair Care In Winter : చలికాలంలో చర్మాన్ని, జుట్టును సహజంగా హైడ్రేట్​ చేయాలంటే.. ఇవే బెస్ట్

Skin and Hair Care in Winter : చలికాలంలో చర్మాన్ని, జుట్టును సహజంగా హైడ్రేట్​ చేయాలంటే.. ఇవే బెస్ట్

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 15, 2022 11:04 AM IST

Skin and Hair Care in Winter : చలికాలంలో దురద, ఎండిపోయిన, పొడి, నిస్తేజమైన చర్మం, జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీ చర్మం, జుట్టును రక్షించుకోవడం చాలా ముఖ్యం. అయితే కిచెన్లో ఉండే వాటితోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.

స్కిన్ కేర్ టిప్స్
స్కిన్ కేర్ టిప్స్

Skin and Hair Care in Winter : శీతాకాలం అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే చర్మం పొడిబారడం ప్రారభిస్తోంది. చుండ్రు సమస్యలు వచ్చేస్తున్నాయి. జుట్టు, చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో పోషకాహారలోపానికి కూడా ఎక్కువ గురవుతాము. పైగా చలిని తగ్గించుకోవడానికి.. హీటర్లు, హెయిర్ డ్రైయర్లను ఆశ్రయిస్తాము. ఇవి మన పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. అయితే అంతర్గత పోషణతో పాటు.. బాహ్య పోషణ కూడా తీసుకోవడం చాలా అవసరం.

మీరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే.. మీ చర్మం, జుట్టు నిస్తేజంగా, పొడిగా, పెళుసుగా మారకుండా ఉండడానికి ఈ శీతాకాలంలో మీరు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం కొన్ని సహజ పదార్థాలను మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ పదార్థాలు ఏమిటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి

ఏడాది పొడవునా సులభంగా లభించే పండు అరటి పండు. ఇది మీ చర్మం, జుట్టుకు మంచి ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ.. శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది. అరటిపండు గుజ్జును తేనెతో మిక్స్ చేసి.. మీ ముఖానికి ఫేస్ ప్యాక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల మీ చర్మం మృదువుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జుతో మీ జుట్టుకు హెయిర్ మాస్క్‌ వేసుకోవచ్చు. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. షాంపూలు, కండీషనర్‌లతో సహా సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడంలో అరటిపండును కచ్చితంగా ఉపయోగిస్తారు.

పాలు

మీ చర్మం, జుట్టు కోసం సంరక్షణ కోసం చలికాలంలో పాలును తీసుకోవచ్చు. మీ ముఖంపై పచ్చి పాలని అప్లై చేస్తే.. అది మీకు మంచి గ్లో ఇస్తుంది. జుట్టుకు అప్లై చేస్తే.. ప్రీ-కండీషనర్‌గా ఫలితాలు ఇస్తుంది. మెరిసే, మృదువైన చర్మం కోసం.. ముఖానికి పాలు, తేనే కలిపి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాలు ఉండనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

తేనె

వంటగదిలో కనిపించే అత్యంత శక్తివంతమైన పదార్ధాలలో తేనె ఒకటి. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. ఫైన్ లైన్స్, ఇతర వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె లేదా మీకు ఇష్టమైన నూనెతో కలిపి దీనిని తీసుకుని జుట్టుకు అప్లై చేస్తే.. అది మీ జుట్టును గొప్పగా మాయిశ్చరైజ్ చేస్తుంది. పగిలిన, ఎండిన పెదవులకు ఇది మంచి ఫలితాలు అందిస్తుంది.

ఓట్ మీల్

గ్రేట్ స్కిన్‌కేర్ గుణాలను కలిగి ఉన్న ఓట్ మీల్ శరీరం, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. పెరుగు లేదా తేనెతో కలిపి దానిని తీసుకున్నప్పుడు ఇది గొప్ప ఫేస్ మాస్క్‌గా పని చేస్తుంది. చుండ్రును తగ్గించడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది.

అలోవెరా

చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో కలబంద పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా శీతాకాలంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. విటమిన్ E, C, బీటా-కెరోటిన్‌తో సమృద్ధిగా ఉన్న కలబంద.. శీతాకాలంలో పొడి, దెబ్బతిన్న చర్మాన్ని, స్కాల్ప్‌ను సులభంగా రిపైర్ చేస్తుంది.

కొబ్బరి నూనె

చలికాలంలో కొబ్బరినూనె ఇచ్చే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. గోరువెచ్చని కొబ్బరినూనెను పొడిబారిన, డల్ హెయిర్‌కి అప్లై చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా చలికాలపు కఠినత్వం నుంచి చర్మాన్ని రక్షించే ఫ్యాటీ యాసిడ్స్‌తో ఇది సమృద్ధిగా నిండి ఉంటుంది. మీ చర్మం ఎండిపోయినట్లు కనిపించే ప్రాంతాలను కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. అంతేకాకుండా ఇది పగిలిన మడమలకు అద్భుత ఫలితాలు ఇస్తుంది.

అవకాడో

అవకాడోలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ కారణంగా చలికాలంలో చర్మానికి, జుట్టుకు మంచి మెరుపు అందుతుంది. ఈ నూనెలు చర్మంలోని తేమను పునరుద్ధరించగలవు. అందుకే అవకాడోలను ముఖానికి, శిరోజాలకు పోషణగా ఉపయోగిస్తారు. లేదంటే అవకాడోను మెత్తగా చేసి మీ పొడి చర్మానికి అప్లై చేయవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఇ మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. అదేవిధంగా అవోకాడో గుజ్జును జుట్టు తంతువులకు అప్లై చేయడం వల్ల వాటిలో ఉండే ప్రొటీన్లు, అమినో యాసిడ్లు, ఐరన్ మొదలైన వాటి వల్ల నిస్తేజంగా, ఎండిన, చిట్లిన జుట్టు రిపైర్ అవుతుంది.

హైడ్రేటెడ్, తేమతో కూడిన చర్మం, జుట్టు కోసం ఈ వింటర్ సీజన్‌లో మీ బ్యూటీ రొటీన్‌లో వీటిని కలిపి తీసుకుని.. మీరు మెరిసిపోండి.

Whats_app_banner

సంబంధిత కథనం