తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Boost Fertility । జంటలలో సంతాన సామర్థ్యం పెరిగేందుకు ఆరోగ్య సూత్రాలు!

Tips To Boost Fertility । జంటలలో సంతాన సామర్థ్యం పెరిగేందుకు ఆరోగ్య సూత్రాలు!

HT Telugu Desk HT Telugu

21 March 2023, 15:34 IST

  • Tips To Boost Fertility: మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారైతే ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి, వీటిని అనుసరించడం ద్వారా మీరు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.

Tips To Boost Fertility
Tips To Boost Fertility (istock)

Tips To Boost Fertility

ఇటీవల కాలంలో చాలా మంది కొత్తజంటలు సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గానీ పిల్లలు ఉండటం లేదు. ఇందులో కొన్ని జంటలు గర్భందాల్చడం కావాలని ఆలస్యం చేస్తుంటే, ఎక్కువ మందికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తే గానీ పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. చాలా సందర్భాలలో ఈ సమస్యకు సరైన కారణం తెలియడం లేదు. ఒకప్పుడు స్త్రీలలో మూడు నెలలు గడిస్తే, గర్భానికి సంబంధించిన సంకేతాలు బయటపడేవి. అయితే ప్రస్తుత కాలంలో నెలసరి తేదీ కాస్త ఆలస్యం అయినా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటున్నారు, ఫలితం సానుకూలంగా రాకపోతే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలా వెంటనే పరీక్షలు జరుపుకోవడం వలన కూడా గర్భాన్ని నిర్ధారించలేము.

సాధారణంగా మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే కారకాలు అండోత్సర్గము, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) , లూపస్, గర్భాశయ అసాధారణతలు మొదలైనవి ఉంటున్నాయి. పురుషుల విషయంలో తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్, తక్కువ స్పెర్మ్ కౌంట్ అలాగే సల్ఫసాలజైన్ వంటి కొన్ని ఓవర్-ది-కౌంటర్ మందులు వంధ్యత్వానికి దారితీయవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఇటీవల నిర్వహించిన చేసిన ఒక అధ్యయనం ప్రకారం, శరీరంలో తలెత్తే దీర్ఘకాలిక మంట, వాపులు కూడా వంధ్యత్వానికి సంబంధించిన సంకేతాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వలన గర్భధారణ రేటు మెరుగుపడుతుంది, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి చికిత్సలలో కూడా సానుకూల ఫలితాలు వస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వారు పేర్కొన్నారు.

Tips To Boost Fertility- సంతాన సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన వంధ్యత్వాన్ని నియంత్రించవచ్చు. గర్భం కోరుకునే జంటలకు మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడానికి, మీరు అనుసరించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలను ఇక్కడ తెలుసుకోండి.

చురుకైన జీవనశైలిని అనుసరించండి

నిశ్చలమైన, శ్రమలేని జీవనశైలి నుంచి బయటకు రండి, చురుగ్గా ఉండండి. మరింత చురుకైన జీవనశైలిని అవలంబించడం వలన సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మీ శరీరాన్ని అర్థం చేసుకొని, మీ సామర్థ్యానికి తగినట్లుగా వ్యాయామాలు చేయండి, యోగాసనాలు సాధన చేయండి. మితిమీరిన వ్యాయామం కూడా మంచిది కాదు. అధిక అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామం చేయడం వలన కొంతమంది స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది.

పొగ త్రాగటం మానేయండి

ధూమపానం శ్వాసకోశ రుగ్మతలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులనే కాకుండా, ఇది పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తుంటే, ధూమపానం పూర్తిగా మానేయండి.

మద్యపానం పరిమితం చేయండి

అధిక మద్యపానం అండోత్సర్గము రుగ్మతలు, శరీరంలో వాపులు, బలహీనమైన పేగు, కాలేయ పనితీరు మందగించడం వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మద్యపానానికి దూరంగా ఉండడాన్ని పరిగణించండి.

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి, ఆందోళనలు వ్యక్తుల సంతానోత్పత్తి స్థాయిలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఒత్తిడిని నియంత్రించుకోండి. అనవసరపు ఆందోళనలకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన జీవనం గడపండి. ధ్యానం ఆచరించడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

తగినంత నిద్ర

మీరు తీసుకునే విశ్రాంతి మీ శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది, మిమ్మల్ని రిఫ్రెష్‌గా, చురుకుగా ఉంచుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మీరు తగినంత నిద్ర పోవడం వలన మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

ఈ చిట్కాలను అనుసరించడంతో పాటు, మీ వైద్యులు సూచించిన సిఫారసులు పరిగణలోకి తీసుకోవడం. వేళకు సరైన పోషకాహారం, మందులు తీసుకోవడం ద్వారా మీ సంతాన సామర్థ్యం స్థాయి పెరుగుతుంది.