Fertility Boosting Foods | పిల్లల్ని కనాలనుకునే వారు ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి!
16 August 2022, 19:31 IST
- పిల్లల్ని కనాలనే ఆలోచన ఉన్నవారు ముందుగా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆడ, మగ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తవు. సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఇలాంటి ఆహారాలు (Fertility Boosting Foods) తీసుకోండి.
Fertility Boosting Foods
ఈరోజుల్లో ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం, ఒత్తిడితో కూడిన జీవనశైలి తదితర అంశాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. చాలా జంటలకు వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతాన యోగం మాత్రం కలగటం లేదు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బును, తమ విలువైనా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయినా ఫలితం శూన్యంగానే ఉంటుంది.
సంతానం కలగాలంటే తల్లీ, తండ్రీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల్ని కనాలనే ఉద్దేశ్యం ఉంటే కచ్చితంగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, అధిక బరువును నియంత్రించుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సహజసిద్ధంగానే పిల్లల్ని కనే సామర్థ్యాన్ని సాధించాలి. ఇందుకోసం మీ డైట్‌లో తప్పనిసరిగా కొన్ని సూపర్‌ఫుడ్‌లను (Fertility Boosting Foods) చేర్చుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్‌లు మొదలైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను సూపర్‌ఫుడ్‌లు అంటారు.
ఇలాంటి ఆహారాలు అంతర్లీనంగా ఏర్పడే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించటమే కాకుండా మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. మరి ఇందుకు మీరు ప్రతిరోజూ తినే ఆహారంలో ఎలాంటివి తీసుకోవటం మంచిదో ఇక్కడ తెలుసుకోండి.
ఆకు కూరలు
ఆకు కూరలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అండోత్సర్గానికి సహాయపడతాయి. గర్భధారణ సమయంలో గర్భస్రావం జరిగే ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. క్రోమోజోమ్‌లకు సంబంధించిన ఏవైనా సమస్యలను అదుపుచేస్తాయి. కాబట్టి పాలకూర, మెంతికూర, బ్రోకలీ, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ పోషకం మగ వారికైనా, ఆడ వారికైనా వారి సంతానోత్పత్తికి సామర్థ్యానికి చాలా అవసరమైనది. పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరగటానికి, వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవటానికి జింక్ అవసరం. అందువల్ల జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు తింటూ ఉండాలి. ఇది పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అరటిపండు
అరటిపండులో విటమిన్ B6 ఎక్కువగా లభిస్తుంది. ఇది అండం ఫలదీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. అంతేకాదు అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు స్త్రీలలో అండం పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత మెరుగుపరుస్తాయి. కాబట్టి అరటిపండ్లు వద్దనకుండా తినాలి.
డ్రైఫ్రూట్స్, నట్స్
డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్‌లలోప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వాల్‌నట్‌లో సెలీనియం ఉంటుంది, ఇది క్రోమోజోమ్ నష్టాన్ని తగ్గిస్తుంది. ఇందులో అండం ఉత్పత్తిని ప్రోత్సహించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే రోజూ డ్రై ఫ్రూట్స్ , నట్స్ తినడం ప్రారంభించండి.
ఆరోగ్యకరమైనవి తింటూనే కొన్ని అలవాట్లను వదులుకోవాలి. మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రకమైన అలవాట్లు కలిగి ఉంటే మీరు ఎలాంటి వైద్యం తీసుకోకపోయినా శుభవార్త వింటారు.