తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Male Fertility | 30 దాటిన మగవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే.. 'మగతనం' అంతంతే!

Male Fertility | 30 దాటిన మగవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే.. 'మగతనం' అంతంతే!

HT Telugu Desk HT Telugu

08 June 2022, 22:15 IST

google News
    • 30 దాటిన మగవాళ్లు వారి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కొన్ని అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలి. లేదంటే వారిలో సంతాన సామర్థ్యం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
Correct these bad habits that can harm a man's sperm count and reproductive health
Correct these bad habits that can harm a man's sperm count and reproductive health (Unsplash)

Correct these bad habits that can harm a man's sperm count and reproductive health

సాధారణంగా చాలా మంది మగవాళ్లు తమ జీవనశైలిపై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచరు. మంచిది కాదని తెలిసినా కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టరు. మగవాళ్లూ.. మీరు మీ ముప్పై ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నట్లయితే, మీ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్య జీవనశైలిని గడుపుతున్నట్లయితే.. మీరు 40 ఏళ్ల వయస్సుకు చేరుకున్న తర్వాత మీకు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా మీరు ఒక బిడ్డకు జన్మను ప్రసాదించే అవకాశాన్ని కోల్పోతారని పరిశోధకులు అంటున్నారు.

ఒక జంట గర్భం దాల్చాలంటే ఆడ, మగ ఇద్దరూ కీలకపాత్ర పోషిస్తారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి వద్ద లోపం ఉన్నా, ఆ సమస్యను ఇద్దరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మగవారి పునరిత్పత్తిలో లోపం ఉన్నా బిడ్డను కనని పరిస్థితుల్లో ఆడవారే ఎక్కువగా నిందలు, అవమానాలు భరిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇటీవల కాలంలో జంటలలో సంతానలేమికి కారణం 50% పురుషుల నిర్లక్ష్యపు జీవనశైలే కారణం అని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషులు చెడు అలవాట్లతో తమ సంతాన సామర్ర్థ్యాన్ని తామే దెబ్బతీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి.

గుర్గావ్‌లోని నోవా సౌత్‌ఎండ్ IVF సెంటర్లో ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ గుంజన్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రతి 8 మంది జంటల్లో ఒకరు మంది గర్భధారణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ వద్దకు వచ్చిన కేసుల్లో 40 శాతం పురుషులలో వంధ్యత్వానికి సంబంధించినవే అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్లో చాలావరకు ఊబకాయం, తగినంత నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌ల అతి వినియోగం, సిగరెట్లు, ఆల్కహాల్ అలాగే డ్రగ్స్ వంటి అలవాట్లు ఉన్నవారేనని పేర్కొన్నారు.

మగవారు కొత్తగా 'నాన్న' అనే పిలుపు వినాలంటే దీర్ఘకాలికంగా ఉపయోగపడే కొన్ని పాయింటర్‌లను వైద్య నిపుణులు హైలైట్ చేశారు. 

లైఫ్‌స్టైల్ మార్చాల్సిందే

నిశ్చలంగా ఒక చోట ఉంటే అది ఊబకాయానికి దారితీస్తుంది. దాని ప్రభావం సంతాన సామర్థ్యం పడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి రెగ్యులర్ వర్కౌట్ రొటీన్‌కు కట్టుబడి ఉండాలి. వారానికి ఐదు రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల సత్తువ పెరుగుతుంది. అప్పుడే వైద్యం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపరచడం సాధ్యపడుతుంది.

అలాంటి ఆహారం వద్దు

మీరు మీ సంతానోత్పత్తి స్థాయిలను బాగా ఉంచుకోవాలనుకుంటే, తరచుగా ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటును వదులుకోవడం ఉత్తమం. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే మగవారిలో "సాధారణ" ఆకారం ఉండే స్పెర్మ్ కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు తేలింది. అంటే స్పెర్మ్ కౌంట్ బాగానే ఉన్నప్పటికీ ఆ కణాలు సరైన ఆకారంలో ఉండవు. ఇవి అండం ఫలదీకరణకు ఉపయోగపడవు.

ధూమపానం- మద్యపానం

ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే వీర్యం నాణ్యత తగ్గుతుంది. ఇది స్పెర్మ్‌లో DNA దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి, అంగస్తంభన లోపం, స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాట్లు వెంటనే మానేయాలి.

మాదకద్రవ్యాల వాడకం

కండరాల పెరుగుదలను ప్రేరేపించడానికి తీసుకున్న కొన్ని రకాల అనాబాలిక్ స్టెరాయిడ్స్ వృషణాలను కుంచించుకుయేలా చేస్తాయి. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే కొకైన్ లేదా గంజాయిని పీల్చడం, తంబాకు నమలడం వల్ల మీ స్పెర్మ్ సంఖ్య, నాణ్యత తగ్గిపోవచ్చు.

ఒత్తిడి

ఒత్తిడి, ఆందోళనలు టెస్టోస్టెరాన్ అసమతుల్యత వంటి హార్మోన్ల మార్పులకు దారితీస్తుంది, ఇది నేరుగా పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే భావోద్వేగాలపై నియంత్రణ లభిస్తుంది.

ఆలాగే కొన్ని రకాల ఔషధాల వాడకం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అతి వినియోగం, రేడియేషన్, లైంగిక వ్యాధులు, వృషణాల వద్ద వేడి, జన్యుపరమైన సమస్యలు కూడా పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీసే కారకాలుగా ఉంటాయి. ఎప్పుడైనా సరే సొంత ప్రయోగాలు కాకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం