ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దీనికి చాలా మంది చాలా రకాలుగా సమాధానం ఇస్తారు. ఎక్కువగా భక్తి సంబంధమైన ఒక భావనగా భావిస్తారు. లేదా జీవితంలో వైరాగ్యం ఆవహించిన వారు కలిగి ఉండే ఒక చింతన అనుకుంటారు. నిజానికి ఆధ్యాత్మికతకు సార్వత్రిక నిర్వచనం లేదు, ఆధ్యాత్మికతను ఆచరించడానికి నిర్ధిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదు. సంస్కృతంలో ఆధ్యాత్మికతకు ఆత్మతో పరిశీలించేది, ఆత్మవలన కలిగే భావోద్వేగాలు అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఈ ఆధ్యాత్మికత భావన కలిగి ఉండటం వలన మనసులో ఒక ప్రశాంతత, ఒక నిశబ్ధం ఏర్పడుతుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. ఆధ్యాత్మికతతో శారీరక, మానసిక శ్రేయస్సు సిద్ధిస్తుంది అని చాలా మంది విశ్వసిస్తారు కూడా.
ఆధ్యాత్మిక జీవితం గడపడం ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం, ప్రార్థన, యోగా, శ్రద్ధ, భక్తి మొదలైన పద్దతులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మార్గాలు. వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకొని నడిచినా, అది వారి వికాసానికి, వారి శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో ఇక్కడ చూడండి.
ఒక వ్యక్తి ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరం కొన్ని హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అది దీర్ఘకాలంలో వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఒత్తిడితో కూడిన జీవితం ఆందోళన, రక్తపోటు, నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటుకు దారితీయవచ్చు. ఆధ్యాత్మిక అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ రకమైన అభ్యాసాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.
నిరాటంకమైన రాత్రి నిద్ర ప్రతీ వ్యక్తి ఆరోగ్యానికి చాలా ఆవశ్యకమైనది. జీవనశైలి, మనసుకు తాగిలిన గాయం, జీవితంలోని కొన్ని సంఘటనలు, పరివర్తనాల ఫలితంగా కొంతమందికి దీర్ఘకాలిక నిద్ర సమస్యలు ఉండవచ్చు. దీనికి ఆధ్యాత్మికత సరైన వైద్యం. ఆధ్యాత్మిక అభ్యాసాలు వ్యక్తుల మానసిక, భావోద్వేగ అంశాలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఆధ్యాత్మికతతో ఉండటం వలన జీవితంలో అనుభవించిన బాధల నుంచి గొప్ప ఊరట లభిస్తుంది. సుఖ:దుఖాలు తాత్కాలికమైనవని స్పష్టత వస్తుంది. ఇలా మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం కల్పిస్తుంది.
ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమైనప్పుడు మనస్సు అత్యంత ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది కాబట్టి, మన మనసులోని ఆందోళనను నియంత్రించడంలో ఆధ్యాత్మికత సహాయపడుతుంది. ఆందోళనకు గల కారణాలను, దానికి ఆజ్యం పోసే ఆలోచనలను ఆధ్యాత్మికత భావన శాంతింపజేస్తుంది. మనసులో పగ, ప్రతీకారాలు, కోపం, ధ్వేషం అన్ని చెదిరిపోతాయి. ఇది ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మీ సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది.
ఆధ్యాత్మికత వలన శరీరం, మనస్సు సమతుల్య స్థితిలోకి వస్తాయి. తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. దాని పనితీరును మెరుగుపడుతుంది. ధ్యానం, బుద్ధిపూర్వక అభ్యాసాలు, ఇతర సారూప్య కార్యకలాపాలు మానసిక శారీరక ఆరోగ్యం మధ్య సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడతాయి.
ప్రార్థన, ధ్యానం తదితర అభ్యాసాల రూపంలో ఆధ్యాత్మికత మనిషిలోని నిరాశ, నిస్పృహలను దూరం చేస్తుంది. జీవితంపై సానుకూల దృక్పథం కలిగేలా అవకాశం ఇస్తుంది. మానసిక కల్లోలం, ఆత్మహత్య ఆలోచనలు, ఇతర తీవ్రమైన ఆలోచనలను నియంత్రించడంలో ఆధ్యాత్మిక అభ్యాసాలు సహాయపడతాయి.
సంబంధిత కథనం