Horse Riding। డుగ్గుడుగ్గుమని కాదు డిక్చిక్ డిక్చిక్ అంటూ గుర్రపు స్వారీ చేయండి, దీని ప్రయోజనాలే వేరండి!
Horse Riding Benefits: గుర్రపు స్వారీ చేయడం కూడా ఒక వ్యాయామమే. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడం మొదలుకొని మానసికంగా దృఢంగా ఉంచటం వరకు.. గుర్రపు స్వారీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
వ్యాయామం చేయడానికి వాహనం మీద ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లే రోజులు ఇవి. నాలుగు గోడల మధ్య జిమ్‌లో గంటల తరబడి ట్రెడ్‌మిల్లులపై పరుగులు తీసే రోజులు ఇవి. కానీ వ్యాయామం అంటే కేవలం శరీరానికే కాదు, మనసుఅది మనసును కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంచాలి.
మీరెపుడైనా గుర్రపు స్వారీ చేశారా? చల్లటి ఉదయాన లేలేత సూర్యకిరణాలు తాకుతుండగా అలా చెట్ల గాలి పీలుస్తూ గుర్రపు స్వారీ చేయడం, లేదా సూర్యాస్తమయం సమయంలో సాగరతీరంలో ఎత్తులో కూర్చొని గుర్రంపై పరుగులు తీయడం చాలా సరదాగా ఉంటుంది. అంతేనా? గుర్రపు స్వారీతో మీకు మంచి వ్యాయామం కూడా లభిస్తుందని మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా గమనిస్తే మీరు గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు మీ శ్వాసక్రియ రేటు పెరుగుతుంది, మీ శరీరం అంతా కదులుతుంది. మీకు చెమటలు కూడా పడతాయి. అంటే మీరు వ్యాయామం చేసినపుడు పొందే ఫలితాలు గుర్రపు స్వారీ చేయడం ద్వారా కూడా కలుగుతాయి.
టెక్సాస్ A&M యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, గుర్రపు స్వారీ చేయడం ద్వారా నిమిషానికి దాదాపు ఏడు కేలరీలు ఖర్చు అవుతాయి.
45 నిమిషాల పాటు గుర్రపు స్వారీ చేయడం ద్వారా సుమారు 200 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు. ఇంకా వేగంగా గుర్రంతో ట్రోటింగ్, జంపింగ్ చేయడం వలన సుమారు 600 కేలరీలు కాల్చవచ్చునని అధ్యయనాల్లో వెల్లడైంది.
అంతేకాదు గుర్రపు స్వారీ ఎంతో ఉల్లాసమైనది, ఇది మిమ్మల్ని ప్రకృతితో కూడా మమేకం చేస్తుంది. తద్వారా శరీరానికే కాదు మనసుకు ఇది మంచి వ్యాయామాన్ని అందిస్తుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Horse Riding Health Benefits- గుర్రపు స్వారీతో ఆరోగ్య ప్రయోజనాలు
గుర్రపు స్వారీ చేయడం ద్వారా కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేలరీలు బర్న్ అవుతాయి
గుర్రపు స్వారీ నిజంగా మంచి కార్డియోవాస్కులర్ వ్యాయామం. కేవలం అరగంట రైడింగ్ చేయడం కూడా మితమైన వ్యాయామం చేయడమే. ఈ ఆదివారం పూట మీరు తినేటువంటి మాంసాహారపు లంచ్‌ను అరిగించటానికి, కాలరీలు కరిగించటానికి గుర్రపు స్వారీ చేయండి. వినోదమూ లభిస్తుంది, వ్యాయామమూ అవుతుంది.
రక్తపోటును తగ్గించవచ్చు
గుర్రపు స్వారీ ద్వారా కలిగే ప్రయోజనాల్లో రక్తపోటును తగ్గించడం కూడా ఒకటి. అధిక రక్తపోటును తగ్గించడంలో గుర్రపు స్వారీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యానికి మంచిది
తరచుగా గుర్రపు స్వారీ చేసే వారు ఎల్లపుడూ ప్రశాంతంగా ఉంటారని చెబుతారు. గుర్రంతో గడపడం, గుర్రపు స్వారీ చేయడం వలన దానితో భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇలా జంతువులతో ఉల్లాసంగా గడపడం వలన మెదడులో సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి, ఇది మిమ్మల్ని మంచి మానసిక స్థితిలో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. సైనికులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను అధిగమించడానికి అందించే చికిత్సలలో వారితో గుర్రపు స్వారీ చేయించడం కూడా ఒకటి.
కండరాలు బలోపేతం
గుర్రం పైన కూర్చోవడం, సమతుల్యంగా ఉండటానికి మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోవడం వలన మీ శరీరంలోని అన్ని భాగాలలో కదలిక ఉంటుంది. తద్వారా మీ కోర్ కండరాలను బలోపేతం అవుతాయి. మీలో సత్తువ పెరుగుతుంది, నియంత్రణ శక్తి పెరుగుతుంది. మీ శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది.
మీ శ్వాసను మెరుగుపరుస్తుంది
గుర్రపు స్వారీ మిమ్మల్ని స్వచ్ఛమైన గాలిలోకి పీల్చుకునేలా చేస్తుంది. మీ వీపు, చేతులు, మీ కండరాలకు శ్రమ కలగడం వలన మంచి వ్యాయామం అవుతుంది. మీరు మరింత లోతుగా శ్వాస తీసుకుంటారు. ఈ కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. గుర్రం వేగాన్ని బట్టి మీరు కూడా ఒకసారి నెమ్మదిగా, ఇంకోసారి వేగంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇది మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఈ చర్య మిమ్మల్ని రిలాక్సింగ్‌గా ఉంచే ఒక మ్యాజికల్ టెక్నిక్. మీ ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.
డుగ్గు డుగ్గు మనుకుంటూ బుల్లెట్ బండి మీద సవారీ చేయడం ఠీవీగానే ఉంటుంది, కానీ, డిక్చిక్ డిక్చిక్ మనుకుంటూ గుర్రం మీద స్వారీ చేస్తే అది ఎంతో రాజసంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్