Royal Enfield Electric Bike। డుగ్గు డుగ్గు సౌండ్ లేని ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్.!-royal enfield electric bullet bike launch expectations and highlights ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Royal Enfield Electric Bullet Bike Launch Expectations And Highlights

Royal Enfield Electric Bike। డుగ్గు డుగ్గు సౌండ్ లేని ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్.!

Manda Vikas HT Telugu
Sep 06, 2022 08:32 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లకు భారతదేశంలో చాలా పాపులారిటీ ఉంది. RE బుల్లెట్ వాహనాలు సమాజంలో వారి తరగతి, హోదాకు ప్రసిద్ధి చెందాయి. అయితే ఇందులో ఎలక్ట్రిక్ మోడల్స్ (Royal Enfield Electric Bikes) రాబోతున్నాయట. ఆ వివరాలు

Royal Enfield Electric Bullet Bike
Royal Enfield Electric Bullet Bike

రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. భవిష్యత్తులో నిశబ్దంగా దూసుకెళ్లే బుల్లెట్ బైక్‌లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచించాయి.

RE ఎలక్ట్రిక్ బుల్లెట్ రాబోతుందని గత రెండు, మూడేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ ఎడిషన్‌లో అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురావాలని కంపెనీ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. 2025 ద్వితీయార్థంలో లేదా 2026 ప్రారంభంలో RE ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్ మార్కెట్లోకి రానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరి భవిష్యత్తులో వచ్చే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఎలా ఉండవచ్చు? ఎన్ని కిలోమీటర్ల రేంజ్ అందివ్వగలవు అనే అంశాలపైనా కొన్ని అంచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

Royal Enfield Electric Bullet Bike అంచనాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ కెపాసిటీ కూడా పెట్రోల్ బైక్ మోడళ్లలో ఉన్నట్లుగా 350cc నుంచి 650cc వరకు సమానమైన మోటారు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శక్తివంతమైన టార్క్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అదే మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ బైక్ మెయింటెన్స్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ EV కూడా లాంగ్-రేంజ్ అందించే సౌకర్యవంతమైన బైక్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 10kwh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ నుంచి 500 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి సుమారు 8-10 గంటలు పడుతుంది అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఐషర్ మోటార్స్ తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బుల్లెట్ ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ వర్గాలు ఒక ఏజెన్సీతో మాట్లాడుతూ హై-ఎండ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడళ్లపై కస్టమర్ల అంచనాలను ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్