తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress: ఢిల్లీలో రేవంత్ రెడ్డి… భారీగా ప్రక్షాళన ఉండబోతుందా..?

T Congress: ఢిల్లీలో రేవంత్ రెడ్డి… భారీగా ప్రక్షాళన ఉండబోతుందా..?

HT Telugu Desk HT Telugu

25 November 2022, 21:57 IST

    • tpcc president revanth reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తినలో ఉన్నారు. గత 3 రోజులుగా ఢిల్లీలోనే మక్కాం వేసిన ఆయన… పార్టీ అగ్రనేతలతో  కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (twitter)

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TPCC President Revanth reddy Delhi Tour: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్య నేతల రాజీనామాలు, అసంతృప్తుల నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ పై ఆసక్తి నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు పరిస్థితి నెలకొంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిన తర్వాత... మరో సీనియర్ నేత అయిన మర్రి శశిధర్ రెడ్డి కూడా గుడ్ బై చెప్పేశారు. వీరిద్దరూ కూడా రేవంత్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది టైం ఉన్న వేళ... ఇలాంటి పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ హస్తిన టూర్ పై అనేక వార్తలు బయటికి వస్తున్నాయి.

మార్పులు చేర్పులు....!

మూడు రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మక్కాం వేశారు. పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం, డీసీసీల మార్పులుపై కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈసారి జంబో కార్యవర్గం ఉండటంతో పాటు ప్రధాన కార్యదర్శలను పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన కార్యదర్శలకు నియోజవర్గాల బాధ్యతలను అప్పగించే అవకాశాలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో...చేపట్టాల్సిన చర్యలపై కూడా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీసీసీ కార్యవర్గంలో ఓయూ నేతలకు కూడా చోటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వలసలపై ఆరా..!

మరోవైపు పార్టీలో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు. తాజాగా సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నేతలు బయటికి వెళ్లారు. వీరే కాకుండా పలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలకు కూడా రాజీనామాలు చేశారు. చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే వీరంతా కూడా రేవంత్ తీరు నచ్చకే వెళ్లినట్లు వార్తలు రావటమే కాదు... స్వయంగా సదరు నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలు కూడా.. రేవంత్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. జగ్గారెడ్డి వంటి నేతలు డైరెక్ట్ గానే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీనిపై పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా రేవంత్ ఓ నివేదికను కూడా సమర్పించినట్లు సమాచారం.

మరోవైపు వచ్చే నెలలో పార్టీ స్టీరింగ్ కమిటీ భేటీ కూడా జరగనుంది. మల్లికార్జున ఖర్గే సారథ్యంలో తొలిసారిగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ప్లీనరీ ఏర్పాటు, భారత్ జోడో యాత్ర వంటి అంశాలను ప్రస్తావనకు రానున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో రాజకీయ స్థితిగతులపైనా మల్లికార్జున ఖర్గే ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్‌తో అనుసరించాల్సిన వైఖరి, ఇతర వ్యూహాలు, తదితర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు రావొచ్చని తెలుస్తోంది.

మొత్తంగా ఢిల్లిలో మక్కాం వేసిన రేవంత్ రెడ్డి... పార్టీ దృష్టికి ఏ అంశాలను తీసుకెళ్లారు..? తాజా పరిస్థితులపై అధినాయకత్వం ఏం చెప్పింది..? త్వరలోనే ప్రక్షాళన ఉంటుందా..? అనే టీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.