Revanth Reddy : మేం వచ్చాక ఈ మార్పులు చేస్తాం.. రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్-tpcc revanth reddy comments on cm kcr ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tpcc Revanth Reddy Comments On Cm Kcr

Revanth Reddy : మేం వచ్చాక ఈ మార్పులు చేస్తాం.. రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 08:38 PM IST

Revanth Reddy Comments On KCR : చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని చెప్పారు. గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సెప్టెంబర్‌ 17న నిర్వహించే కార్యక్రమాలు, మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌ జోడో యాత్ర ఎజెండా తదితర అంశాలపై మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి ఐదు దశాబ్దాల పాటు మునుగోడు, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు.

'నిజాం పాలనలో మగ్గుతున్న ప్రజలకు స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్. బీజేపీ, టీఆర్ఎస్ చరిత్రను కనుమరుగు చేస్తోంది. పోరాటంలో వారు భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సబ్బండ వర్గాల విజయాలను బీజేపీ, టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయి. చరిత్రకు వారసులం మేం.. ఈ డీఎన్ఏ మాది. విలీన వజ్రోత్సవాలు నిర్వహించే హక్కు కాంగ్రెస్ కే ఉంది. ఆ తరువాత కమ్యూనిస్టులకే ఉంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

వాహనాల కోడ్ టీఎస్ ను తిరస్కరిస్తూ మేం అధికారంలోకి వచ్చాక టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దొరల తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ.. సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామని వ్యాఖ్యానించారు. జాతీయ జెండాతో పాటు.. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రత్యేక జెండాను ఎగురవేస్తామని చెప్పారు. తెలంగాణ త్యాగాలపై కేసీఆర్ కప్పిన మబ్బులను తొలగిస్తామన్నారు.

'వాస్తవ చరిత్ర ప్రజలకు తెలిసేలా సమూల మార్పులు తీసుకొస్తాం. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి.. అక్కడే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అక్టోబర్ 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. రాహుల్ పాదయాత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ. ప్రాణాలకు తెగించి దేశ సమైక్యతను కాపాడేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం