Bharat jodo yatra | దేశ ఐక్యత లక్ష్యంగా `భారత్ జోడో యాత్ర`
- Bharat jodo yatra | దేశ ఐక్యత లక్ష్యంగా తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన ‘భారత్ జోడో యాత్ర’ 12 రాష్ట్రాల్లో 3750 కిలోమీటర్లు సాగి కశ్మీర్లో ముగుస్తుంది. తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణాలొదిలిన తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం, రాహుల్ కన్యాకుమారి చేరుకున్నారు.
Wed, 07 Sep 202202:56 PM IST
Bharat jodo yatra | `తిరంగా వారి సొంత ఆస్తి అనుకుంటున్నారు`
Bharat jodo yatra | భారత్ జోడో యాత్ర తొలి బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. సమాజంలో విద్వేషాలను, కక్షకార్పణ్యాలను రెచ్చగొడ్తున్నాయని బీజేపీ, ఆరెస్సెస్ ల పై విరుచుకుపడ్డారు. భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా ఈ భారత్ జోడో యాత్ర చేపట్టామన్నారు. భారత్లోని ప్రతీ వ్యక్తి మతం, భాషను మన త్రివర్ణ పతాకం ప్రతిబింబిస్తుందని రాహుల్ వివరించారు. కానీ, భారత దేశ జాతీయ పతాకాన్ని సొంత ఆస్తిగా బీజేపీ, ఆరెస్సెస్ లు భావిస్తున్నాయన్నారు.
Bharat jodo yatra | సీబీఐ, ఈడీలకు భయపడం..
విభజన శక్తులను అడ్డుకుని భారత్ ను ఒక్కటి చేయాల్సిన అవసరం దేశంలోని కోట్లాది ప్రజలు భావిస్తున్నారన్నారు. సీబీఐ, ఈడీ మొదలైన దర్యాప్తు సంస్థల ద్వారా నాయకులను, ప్రజలను భయపెట్టాలని బీజేపీ భావిస్తోందని, కానీ భారతీయులు ఎవరికీ భయపడరన్న విషయం వారికి ఇంకా అర్థం కాలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీకి దేశంలోని ఒక్క విపక్ష నేత కూడా భయపడబోరన్నారు.
Bharat jodo yatra | తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో దేశం
భారత్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా ఇప్పుడు గుప్పెడు మంది వ్యాపార వేత్తల నియంత్రణలో ఉందన్నారు. `గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఇప్పుడు 4, 5 వ్యాపార సంస్థలు ఉన్నాయి. అవే దేశాన్ని నియంత్రిస్తున్నాయి` అన్నారు.
Wed, 07 Sep 202212:33 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలకు సోనియా సందేశం
భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం పంపించారు. అనారోగ్యం, మెడికల్ చెకప్స్ కారణంగా స్వయంగా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నందుకు ఎంతో బాధపడుతున్నానని సోనియా తన సందేశంలో పేర్కొన్నారు. ‘గొప్ప చరిత్ర కలిగిన మన కాంగ్రెస్ పార్టీకి ఈ కార్యక్రమం ఒక మేలిమలుపు. ఒక మైలు రాయి. భారత రాజకీయాల్లో కూడా ఇది కీలక మార్పునకు నాంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం చెందుతుందన్న విశ్వాసం నాకుంది’ అని సోనియా ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో మొదటి నుంచి చివరి వరకు పాల్గొంటున్న సుమారు 120 మంది సహచరులకు తన అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
Wed, 07 Sep 202211:51 AM IST
రాహుల్ కు జాతీయ పతాకం అందించిన ముఖ్యమంత్రులు
పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు రంగం సిద్ధమైంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. శ్రీ పెరంబదూర్ లో తండ్రి రాజీవ్ గాంధీకిి నివాళులర్పించిన అనంతరం, రాహుల్ కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ, కామరాజ్ నాడార్, మహాత్మాగాంధీలకు నివాళులర్పించారు. గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
బహిరంగ సభ
కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభానికి చిహ్నంగా రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, చత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భఘేల్ భారత జాతీయ పతాకం అందజేశారు. అనంతరం బీచ్ రోడ్ లో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు.
Wed, 07 Sep 202210:58 AM IST
భారత్ జోడో యాత్ర ప్రారంభం
కాాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం లక్ష్యంగా పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. తమిళనాడులోని కన్యాకుమారిలో బుధవారం సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో 3750 కిలోమీటర్లు సాగి, కశ్మీర్లో ముగుస్తుంది. ఈ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర ఆద్యంతం రాహుల్ కార్యక్రమాలు, బస, భోజనం.. తదితరాలపై పూర్తి కసరత్తుతో సిద్ధమైంది. ఎల్టీటీఈ దాడిలో తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణాలొదిలిన తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం, రాహుల్ కన్యాకుమారి చేరుకున్నారు. ఈ యాత్ర పూర్తి అప్ డేట్స్.. మీ కోసం..