Congress: అప్పుడు ఏం ఊడింది..? ఇప్పుడు కూడా మాకేం కాదన్న రేవంత్ రెడ్డి-tpcc president revanth reddy fires on komatireddy rajagopal reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc President Revanth Reddy Fires On Komatireddy Rajagopal Reddy

Congress: అప్పుడు ఏం ఊడింది..? ఇప్పుడు కూడా మాకేం కాదన్న రేవంత్ రెడ్డి

Mahendra Maheshwaram HT Telugu
Aug 05, 2022 08:14 PM IST

congress meeting in chandur: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీకి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

చండూరు సభలో రేవంత్ రెడ్డి
చండూరు సభలో రేవంత్ రెడ్డి (HT)

revanth reddy fires on rajagopal reddy: మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన... రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2018 ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే... పార్టీని మోసం చేసి బీజేపీలోకి వెళ్తున్నాడని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని... అంతటి గొప్ప వ్యక్తి ఈడీ కేసులతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని గుర్తు చేశారు. కన్నతల్లిలాంటి సోనియాగాంధీని అవమానిస్తే అండగా ఉండాల్సిన సమయంలో... కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రాజగోపాల్ రెడ్డి అమిత్ షా దగ్గరకు వెళ్లారని దుయ్యబట్టారు.

ట్రెండింగ్ వార్తలు

‘పార్టీ అగ్రనేతలపై ఈడీ కేసులు పెట్టి విచారణ వేధిస్తుంటే పోరాటంలో కలిసి రాని రాజగోపాల్ రెడ్డి అమిత్ షా దగ్గరికి వెళ్లాడు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే కలిశాడు. కన్నతల్లి మీద ప్రేమ ఉన్నవ్యక్తి... ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతారా...? కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ... నా నాయకత్వంలో పని చేయటం ఇష్టం లేదని చెప్పారు. హత్యా కేసుల్లో 90 రోజులపాటు జైల్లో ఉన్న అమిత్ షా లాంటి వ్యక్తిని ఎలా కలిశాడు. ఎలా వారి నాయకత్వంలో పని చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఏమైనా ఊడిందా..? ఓ ఎమ్మెల్యే పదవి పోయినా పోయేదేమి లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

త్వరలోనే మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటిస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. స్వయంగా కార్యకర్తలు, నేతలను కలుస్తానని అన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని... అందరూ అండగా ఉండాలని కోరారు. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. తనపై కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని... అయినప్పటికీ భయపడేది లేదన్నారు.

ఇక ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా హాజరయ్యారు. అయితే స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. ఇక సమావేశంలో మాట్లాడిన సీనియర్ నేతలు… రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమీషన్ల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి తప్పకుండా ఓడించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పారు. ఇక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ మాత్రం… రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. బ్రదర్స్ బ్రాండ్ ఉండదని… కేవలం కాంగ్రెస్ పార్టీనే బ్రాండ్ అన్నారు దామోదర్ రెడ్డి. ఇక తమ్ముడి వైపు ఉంటారో… లేక పార్టీ వైపు ఉంటారో అనేది వెంకట్ రెడ్డి తేల్చుకోవాలని డిమాండ్ చేశారు అద్దంకి దయాకర్.

IPL_Entry_Point