Srisailam Brahmotsavam 2025 : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఈసారి అదనపు ఏర్పాట్లు..!
Srisailam Maha Shivratri Brahmotsavam 2025: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. 11 రోజులు సాగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవలే వెల్లడించారు. మార్చి ఒకటో తేదీతో ముగుస్తాయని… 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఈసారి విస్తృత ఏర్పాట్లు…
ఇటీవలే ఆలయ ఈవో శ్రీనివాసరావు రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధ చేయాలని ఈవో పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారంలోగా అన్ని ఏర్పాటు పూర్తి అయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. గత ఏడాది ఈసారి మరింతగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరునాడు జరిగే రథోత్సవం కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. క్యూలైన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వాహనసేవలతో పాటు భక్తుల రద్దీ..!
మహాశివరాత్రి వేళ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అందులోనూ శ్రీశైలం ప్రత్యేకమని చెప్పొచ్చు. సాధారణ భక్తులతో పాటు శివ మాల ధరించిన భక్తులు భారీగా తరలివస్తుంటారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు వాహన సేవలు కూడా నిర్వహిస్తారు. ధ్వజారోహణ, భృంగి వాహనసేవ, హంస వాహనసేవ, మయూర వాహనసేవ, రావణ వాహనసేవ, పుష్పపల్లకీ సేవ, గజ వాహనసేవ, మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం వంటి ఉంటాయి. ఇక రథోత్సవం, తెప్పోత్సవం, యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కూడా నిర్వహిస్తారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కూడా కీలక మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సమయంలో భక్తులరద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో నిర్దిష్ట సమయంలోనే మల్లిఖార్జునుడి స్పర్శదర్శనం ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు సంబంధించి శ్రీశైలం ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేస్తారు.
సంబంధిత కథనం