Rudrabhishekam: శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేయాలనుకుంటున్నారా? ఈ నియమాలు తెలుసుకోండి
Rudrabhishekam: శ్రావణ మాసంలో రుద్రాభిషేకం నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. శివుని అనుగ్రహంతో అనేక బాధలు తొలగిపోతాయి. ఈ రుద్రాభిషేకం ఎలా చేయాలి? ఇందుకు ఉన్న నియమాలు ఏంటో తెలుసుకుందాం.
Rudrabhishekam: ఆగస్ట్ 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివారాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడి భక్తులు 12 జ్యోతిర్లింగాలను సందర్శించడానికి వెళతారు. లక్షలాది మంది భక్తులు శివాలయాల్లో పూజలు చేసేందుకు మొగ్గు చూపుతారు.

శ్రావణ మాసంలో ప్రతిరోజూ శివలింగంపై నీరు, బిల్వ పత్రాన్ని సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడు ప్రసన్నుడు అవుతాడు. తన భక్తులకు సంపద, ఆనందం, శ్రేయస్సును అనుగ్రహిస్తాడని నమ్ముతారు. శివలింగానికి రుద్రాభిషేకం చేయడం కూడా చాలా శుభప్రదం. ఈ కారణంగా శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ వ్యక్తిపై ఉంటుంది. అయితే రుద్రాభిషేకం చేసేందుకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజా ఫలితం దక్కుతుంది. రుద్రాభిషేకం చేసే విధానం, నియమాలు తెలుసుకుందాం.
రుద్రాభిషేకానికి కావలసిన సామాగ్రి
రుద్రాభిషేకానికి పండ్లు, తెల్లని పూలు, చందనం పేస్ట్, ధూప దీపం, కర్పూరం, అగరబత్తులు, బిల్వ పత్రాలు, గంగాజలం, పచ్చి పాలు, రోజ్ వాటర్, పెర్ఫ్యూమ్, నెయ్యి, నూనె, వత్తి వంటి పూజా సామగ్రిని సేకరించుకోవాలి.
రుద్రాభిషేక విధానం
రుద్రాభిషేకానికి ముందుగా వినాయకుడిని సరైన ఆచారాలతో పూజించండి. దీని తరువాత రుద్రాభిషేకం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకోండి. అప్పుడు పూజ ప్రారంభించండి. శివపార్వతులతో పాటు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ రుద్రాభిషేకం ఉద్దేశ్యాన్ని వివరించండి. దీని తర్వాత రుద్రాభిషేక ప్రక్రియను ప్రారంభించండి.
ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్టించాలి. రుద్రాభిషేకం కోసం తూర్పు దిక్కున కూర్చోవాలి. ఇప్పుడు శివలింగానికి జలాభిషేకం చేయండి. గంగాజలంతో శివలింగాన్ని అభిషేకించాలి. దీని తరువాత రుద్రాభిషేకంలో ఉపయోగించిన వస్తువులను శివునికి సమర్పించండి. చివరగా శివునికి ప్రసాదం అందించండి. పూజలో ఉపయోగించే నీరు, ఇతర ద్రవాలను కుటుంబ సభ్యులపై చల్లండి. ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు.
రుద్రాభిషేక నియమాలు
శివలింగ దేవాలయం నది ఒడ్డున లేదా పర్వతం వైపు ఉన్నట్లయితే అక్కడ ఉన్న శివలింగానికి రుద్రాభిషేకం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి జలాభిషేకం చేయడం శ్రేయస్కరం. నీటితో రుద్రాభిషేకం చేయడానికి రాగి పాత్రను ఉపయోగించాలి. ఇంట్లో ప్రతిష్టించిన శివలింగానికి రుద్రాభిషేకం కూడా చేయవచ్చు. అంతే కాకుండా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయడం లాభదాయకంగా భావిస్తారు.
రుద్రాభిషేకం ప్రయోజనాలు
రుద్రాభిషేకంతో శివుడు ప్రసన్నుడవుతాడు. భక్తులకు ఐశ్వర్యం, సంతోషం, ప్రసాదిస్తాడని నమ్మకం.
ఆస్తికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి పెరుగుతో శివలింగానికి రుద్రాభిషేకం చేయవచ్చు.
శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల మనిషి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.
శివలింగానికి తేనె, నెయ్యి కలిపి రుద్రాభిషేకం చేయడం వల్ల సంపదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పచ్చి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
పాలలో పంచదార వేసి శివలింగానికి నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు ఎంతో శుభ ఫలితాలను పొంది వృత్తిలో గొప్ప విజయాలు సాధిస్తారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.