DIY Lip Balm: నెయ్యి, కొబ్బరినూనెతో లిప్‌బామ్‌ను ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. పిల్లలకు కూడా వాడొచ్చు
DIY Lip Balm: చలికాలంలో పెదాలను మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కొంచెం కష్టం. ఈ సందర్భంలో లిప్ బామ్ మీకు సహాయపడుతుంది. బయట దొరికే లిప్‌బామ్‌లను పిల్లలకు పెట్టడానికి కాస్త ఆందోళన పడాల్సిందే. అందుకే మీ కోసం, మీ పిల్లల కోసం మీరు ఇంట్లోనే ఈజీగా నేచురల్‌గా లిప్‌బామ్‌లను తయారు చేసుకోవచ్చు.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మంతో పాటు పెదవులు కూడా పొడిబారిపోతాయి. చాలా మందికి పెదాలపైన చర్మం పొరలుపొరలుగా ఊడిపోతూ చూడటానికి చికాకుగా తయారవుతుంది. కొందరికి పెదవులు కూడా బాగా ఎండిపోయి రక్తం కూడా రావడం మొదలవుతుంది. ఈ విషయంలో పిల్లలకు అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం కోసం పెదాల సంరక్షణకు ఉపయోగించే లిప్ బామ్, లిప్ క్రీమ్, స్క్రబ్ వంటివి వాడుతుంటాం. మార్కెట్లో దొరికే లిప్ బామ్ విషయంలో పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉన్నప్పటకీ పిల్లల విషయంలో ఇది ఆందోళనకరమే. ఎందుకంటే పిల్లలు లిప్ బామ్ పెట్టీ పెట్టగానే నాకేయడం లాంటివి చేస్తుంటారు. మరి బయట దొరికే వాటిని పిల్లలకు వాడటం మంచిదేనా? అందుకే ఇంట్లోనే మీ కోసం, మీ పిల్లల కోసం నేచురల్ గా ఆరోగ్యకరమైన పదార్థాలతో లిప్ బామ్ చేసుకుంటే బెటర్.
సాధారణంగా మార్కెట్ లో దొరికే లిప్ బామ్ కొంత కాలం మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ పెదవుల పరిస్థితి అలానే మారుతుంది. చలికాలం మొత్తం వినియోగించేలా, చిన్న పిల్లలకు సైతం నమ్మకంగా అప్లై చేసుకునేలా ఇంట్లోనే తయారుచేసుకునే లిప్ బామ్స్ ఉన్నాయి. మీరు ఇంట్లోనే తయారుచేసుకునేందుకు రెండు రకాల లిప్ బామ్ రెసిపీలు ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాం.
1) నెయ్యితో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు:
పిల్లలు బాగా ఇష్టపడి తినే నెయ్యితో కూడా లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం మనకు కావాల్సిందల్లా
- బీట్ రూట్,
- నెయ్యి,
- విటమిన్ ఈ క్యాప్సుల్స్.
తయారీ విధానం:
- లిప్ బామ్ తయారు చేయడానికి ముందుగా బీట్ రూట్ ను తురిమి, తరువాత కాటన్ క్లాత్ లో వేసి బాగా పిండుకోవాలి.
-ఆ రసంలో నెయ్యి వేసి బాగా కలపాలి.
-ఆ తర్వాత విటమిన్-ఈ క్యాప్సుల్ ద్రవాన్ని అందులో వేయాలి.
-మంచి సువాసన రావడం కోసం ఇందులో మీకు నచ్చిన సువాసనభరితమైన నూనెను కూడా ఉపయోగించవచ్చు.
-ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో ఉంచి కాసేపు ఫ్రీజర్ లో ఉంచాలి.
-తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పిల్లలు రాసుకోవడమే.
బీట్ రూట్ ను ఇందులో వాడారు కాబట్టి, అందులో ఉండే సహజ లక్షణమైన గులాబీ రంగు మీ పెదాలపై అమరుతుంది. పైగా సహజమైన రీతిలో తయారుచేసుకున్నారు కాబట్టి పిల్లలకు రాసినప్పటికీ ఎటువంటి దుష్ఫలితాలు రావు.
2) కొబ్బరి నూనెతో లిప్ బామ్ తయారీ:
కావాల్సిన పదార్థాలు:
మీరు కొబ్బరి నూనెతో లిప్ బామ్ కూడా తయారు చేయవచ్చు. ఇందుకోసం మనకు కావాల్సిన పదార్థాలు
- కొబ్బరి నూనె,
- కాస్త తేనె,
- విటమిన్ ఈ క్యాప్సుల్స్.
తయారీ విధానం:
-ముందుగా మీరు ఎంచుకున్న సహజమైన కొబ్బరి నూనెను కాస్త వేడి చేయాలి.
-అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు తేనెను వేసి బాగా కలపాలి.
-ఆ తర్వాత దాంట్లోనే విటమిన్-ఈ క్యాప్సుల్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
-ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలో పోసి డీప్ ఫ్రిజ్ లో ఉంచండి.
కావాల్సినప్పుడల్లా తీసుకుని పెదాలపై అప్లై చేసుకోవడం వల్ల మీకు మృదువైన పెదాలు సొంతం అవుతాయి. ఉత్తమ ఫలితాల కోసం లిప్ స్క్రబ్ ఉపయోగించిన తర్వాత ఈ బామ్ ను అప్లై చేసుకుంటే బాగుంటుంది . పిల్లలు రాసుకున్న పొరపాటున నాకేసినా కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రాత్రి పడుకునే ముందు కూడా ఈ బామ్ లను అప్లై చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు.
సంబంధిత కథనం