TRS Leader : ఖమ్మంలో టీఆర్ఎస్ నేత దారుణ హత్య
ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకుడు కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేత కృష్ణయ్యను దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్ రైతు వేదిక వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన వస్తున్న కొద్ది సేపటికే కృష్ణయ్యను చంపేశారు. టేకులపల్లి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన కొంతకాలం క్రితం సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.
తెల్దారుపల్లి గ్రామ సమీపంలోని మద్దులపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద దుండగులు అతనిపై కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. కృష్ణయ్య మణికట్టును నరికారు. ఈ ఘటన జరిగే సమయంలో కృష్ణయ్య.. అతడి కారు డ్రైవర్ ముత్తేశం కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్నారు.
ఇద్దరూ ప్రయాణిస్తున్న మోటర్‌బైక్‌ను ఆటో ఢీకొట్టడంతో కిందపడిపోయారు. ఇదే అదునుగా దుండగులు ఒక్కసారిగా కృష్ణయ్యపై దాడి చేశారు. విచక్షణారహితంగా పొడిచి చంపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించినట్లు సమాచారం.
కృష్ణయ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బంధువు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నిహితుడు. సీపీఎం నుంచి బయటకురావడం, ఆయన భార్య స్థానిక ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నిక కావడం, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం వంటి కారణాలతో కృష్ణయ్యపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సీపీఎం నేతలే కారణమంటూ కృష్ణయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు.
హత్యలో తమ్మినేని కోటేశ్వరరావు పాత్ర ఉందన్న అనుమానంతో మృతుడి అనుచరులు ఓ వ్యక్తి నివాసం, అతిథి గృహంపై దాడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.