J-K Congress: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్న వందల మంది నేతలు
J-K Congress: కాంగ్రెస్ పార్టీకి గడ్డురోజులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు దాదాపు దేశమంతా అధికారం చెలాయించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ.. మెజారిటీ రాష్ట్రాల్లో నామమాత్రంగా మిగిలింది. తాజాగా మరో రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
J-K Congress leaders quit party for Azad: ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్‌లో పార్టీకి పెద్ద దిక్కు అయిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ తీరుపై, సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇప్పుడు, ఆజాద్‌కు మద్దతుగా జమ్మూకశ్మీర్‌కు చెందిన చాలా మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
J-K Congress leaders quit party for Azad: 64 మంది ఇప్పటికే..
ఆజాద్ ఆగస్ట్ 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయనకు మద్దతుగా ఇప్పటివరకు 64 మంది నాయకులు పార్టీని వీడారు. తాజాగా, పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ మంగళవారం పార్టీని వీడారు. తారాచంద్‌తో పాటు సీనియర్ నేతలు అబ్దుల్ మజీద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్, చాంద్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్.. మరి కొందరు మంగళవారం సంయుక్తంగా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగానే తాము రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
J-K Congress leaders quit party for Azad: మరో 51 మంది..
కాగా, కాంగ్రెస్ పార్టీకి మరో 51 మంది రాజీనామా చేయనున్నారని సమాచారం. వారు తమ రాజీనామా విషయాన్ని బుధవారం ప్రకటించే అవకాశముంది. వారు కూడా ఆజాద్‌కు మద్దతుగానే కాంగ్రెస్‌ను వీడుతున్నారని ఆజాద్ సన్నిహితులు వెల్లడించారు. వారి రాజీనామా కూడా నిజమైతే, ఆజాద్‌కు మద్దతుగా వారం రోజుల్లోపే, 100 మందికి పైగా రాష్ట్ర నేతలు కాంగ్రెస్‌ను వీడినట్లు అవుతుంది. వీరే కాకుండా, దాదాపు డజను మంది సీనియర్ నేతలు, పెద్ద సంఖ్యలో పంచాయితీరాజ్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా, బ్లాక్ స్థాయి నేతలు ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది.
J-K Congress leaders quit party for Azad: ఆజాద్ పెట్టనున్న పార్టీలోకి..
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో త్వరలో కొత్త జాతీయ స్థాయి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. గత వారం రోజులుగా, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాయకులంతా, ఆజాద్ పెట్టబోయే పార్టీలో చేరనున్నారు. దీన్నిబట్టి, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ పెట్టబోయే పార్టీ గణనీయ ప్రభావం చూపే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.ఒకవైపు, కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న ఆజాద్.. మరోవైపు, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా పరిశీలిస్తున్న విశ్లేషకులు.. ఆజాద్ పెట్టబోయే పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా ఉండనుందని విశ్లేషిస్తున్నారు.