Revanth Reddy : ఒంటరి వాడిని చేశారన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఒంటి వాణ్ని చేశారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాపోయారు. పిసిసి పదవి కోసం కక్ష కట్టి ఎన్నికల బరిలో తనను ఏకాకిగా నిలబెట్టారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ, టిఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఒంటరిని చేశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. తనను అభిమానించే వాళ్లకు, కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు తన మనసులో బాధ చెబుతున్నానని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బిజెపి కెసిఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ సుపారి తీసుకున్నాడని, పది రోజులపాటు ఢిల్లీలో ఉండి అమిత్ షా నరేంద్ర మోడీతో రహస్యమంతనాలు జరిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోందని, కాంగ్రెస్ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కేసీఆర్‌కు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టించు కోకుండా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందామన్నారు. దివిసీమల తెలంగాణ రాష్ట్రం కాకూడదన్నారు.
తనను తొలగించే కుట్ర జరుగుతోందన్న రేవంత్…
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారీ కుట్ర జరుగుతుందని, కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ గమనించాలన్నారు. రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని గెలిపించి, స్రవంతికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల లాఠీల దెబ్బలకు ఎవరు భయపడొద్దని, ప్రాణాలైనా ఇద్దాం కాంగ్రెస్ పార్టీని బతికిద్దామని కార్యకర్తలకు నాయకులకు పిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తానని కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి చెప్పారు.
రెండు అధికార పార్టీలు డబ్బులతో గెలుద్దామని చూస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలని, ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు సొంత పార్టీ నాయకులు భారీ కుట్ర చేస్తున్నారని, తనకు పిసిసి శాశ్వతం కాదని సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే అన్నారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని, పిసిసి పదవి వచ్చినప్పటి నుంచి కేసీఆర్, బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తాను ఒంటరి వాడిని అయిపోయానని రేవంత్ రెడ్డి వాపోయారు.