Munugodu Bypoll: మునుగోడు ఎన్నికల సిత్రాలు - రేవంత్ రెడ్డి గుర్రపు స్వారీ
మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలువురు నేతలు మాత్రం… ఓటర్లు ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
Revanth Reddy Horse Riding At Munugodu ByPoll Campaign: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం వేగవంతం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో రోడ్ షోలు చేపట్టిన ఆయన… బుధవారం మునుగోడులో పర్యటించారు.
గుర్రంపై రేవంత్ రెడ్డి….
బుధవారం మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్రంపై స్వారీ చేశారు. రోడ్ షోలో పాల్గొనగా... స్థానిక నేతలు, కార్యకర్తలు కోరిక మేరకు గుర్రంపై స్వారీ చేసి సందడి చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు.
గ్యాస్, పెట్రోల్ పెంచి ఇబ్బందులను గురి చేసిన పార్టీ బీజేపీ అని... ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో ఆడబిడ్డగా వస్తున్న స్రవంతిని గెలిపించాలని కోరారు. లక్ష ఓట్లు వేస్తే... దాదాపు 30 వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బ్యాలెట్ నమూనాపై అభ్యంతరం....
నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు నాలుగో స్థానంలో ఉండాలన్నారు. అయితే అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ అభ్యర్థి పేరును రెండో స్థానంలో ఎలా పెడతారని రేవంత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలను మరోమారు పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్థి పేరును నాలుగో స్థానానికి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.