Khammam Accident : ఖమ్మంలో విషాదం- రేపు బర్త్ డే, రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
07 May 2024, 18:02 IST
- Khammam Accident : ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. రేపు పుట్టిన రోజు జరుపుకోవాలని ఎంతో ఆనందంతో ఉన్న ఓ బాలుడు ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడు ప్రయాణిస్తు్న్న స్కూటీని బైక్ ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
Khammam Accident : ప్రతి సంవత్సరం ఆ బాలుడికి పుట్టినరోజు వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకునే అలవాటు.. గారాల కొడుకు కావడంతో తల్లిదండ్రులు కూడా ఆ బాలుడు కోరిన వస్తువును కొనిచ్చి సంతోషాన్ని పంచేవారు. ఈ ఏడాది కూడా ఆ బాలుడి పుట్టిన రోజు వేడుక రానే వచ్చింది. బుధవారం పుట్టినరోజు కావడంతో రెండు రోజులు ముందుగానే కొత్త బట్టలను కొని తెచ్చుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో ఎప్పటిలాగే జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కుతూహలపడ్డాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఆ బాలుడిని చిదిమేసింది. అంతలోనే ఆ చిన్నారి మోములో మృత్యువు తాండవం చేసింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆ కాలనీ అంతటినీ కంటనీరు పెట్టించింది.
స్నేహితుని తల్లి మృతదేహాన్ని చూసేందుకు వెళుతూ
ఖమ్మం వైయస్సార్ కాలనీకి చెందిన మల్లారపు కృష్ణ, స్వరూప దంపతులు రెక్కల కష్టంతో జీవిస్తున్నారు. కృష్ణ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కొడుకు, కూతురుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే వారి ముద్దుల కుమారుడు విగ్నేష్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం ఆ కుటుంబ ఆశలను ఛిద్రం చేసింది. మంగళవారం ఉదయం విగ్నేష్ స్కూటీపై రోడ్డెక్కాడు. తన స్నేహితుని తల్లి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అదే కాలనీలో ఉంచిన ఆమె మృతదేహాన్ని చూసేందుకు విగ్నేష్ స్కూటీపై బయలుదేరాడు. రోడ్డెక్కిన కొద్దిసేపటికే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం విగ్నేష్ బండిని బలంగా ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన ఆ బాలుడు చలనం కోల్పోయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ప్రమాద ధాటికి గుండె ఆగిపోయిందని భావించిన స్థానికులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కింద పడడంతోనే విగ్నేష్ మృతి చెందినట్లు స్పష్టమైనది. ఈ ప్రమాదంలో విగ్నేష్ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టిన మరో ద్విచక్ర వాహనం ఇంజిన్ పగిలిపోయింది. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గంజాయి మత్తే ప్రమాదానికి కారణమా?
విగ్నేష్ ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఆ కాలనీలో ఆ ఇద్దరు ఉదయం నుంచి చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తున్నట్లు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెబుతున్నారు. భయంకర స్థాయిలో గంజాయి మత్తులో ఉన్న కారణంగానే ఆ యువకులు ఈ ప్రమాదానికి కారణమై విగ్నేష్ ను పొట్టన పెట్టుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో యువత గంజాయి మత్తులో జోగుతోంది. ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులు సైతం గంజాయికి అలవాటు పడి తాము ఏం చేస్తున్నామో తెలియని అపస్మారక స్థితిలో ప్రమాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ ప్రమాదంలో విగ్నేష్ అనే 15 ఏళ్ల బాలుడి మరణానికి కారణం కాగా ఢీ కొట్టిన యువకుడి కాలు పూర్తిగా ఛిద్రమైపోయింది.
కుటుంబంలో కల్లోలం..
ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విగ్నేష్ 6.2 మార్కులు సాధించాడు. వేసవి సెలవులు పూర్తయితే తన సోదరితో కలిసి కళాశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో కొత్త దుస్తులను సైతం తెచ్చి పెట్టుకున్నాడు. ఈ సంతోష సమయంలో చోటుచేసుకున్న విషాద ఘటన విగ్నేష్ ను అనంతలోకాలకు చేర్చింది. ఆటో తోలుకుంటూ పిల్లల్ని చదివించుకునే ఆ తండ్రి చేతికొస్తున్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్నేహితుని తల్లి మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన విగ్నేష్ ను, ఆ స్నేహితుని తల్లి మృతదేహాన్ని ఉంచిన మార్చురీ గదిలో ఉంచడం మరింత విషాదాన్ని నింపింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి