Marri Shashidhar Reddy : బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో ముఖ్య నేతల సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Marri Shashidhar Reddy Join in BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో... కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద్ సోనావాలా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్,డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుక పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన మర్రి శశిధర్ రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ ఇన్‌ఛార్జి నేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే కారణమని, తోటి నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ(TRS Party)తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. క్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. సోనియా గాంధీ(Sonia Gandhi) కూడా ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వేటు...
Marri Shashidhar Reddy Suspended From Congress: సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిపై కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలవటంతో పాటు... పార్టీపై సీరియస్ కామెంట్స్ చేయటాన్ని సీరియస్ గా తీసుకుంది. పార్టీకి క్యాన్సర్ సోకిందన్న వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై క్రమశిక్షణా సంఘం ఆరేళ్ల పాటు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని మర్రి శశిధర్ రెడ్డి తెంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి శశిధర్‌రెడ్డి.. ఈ మధ్యే కాంగ్రెస్‌ను వీడారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హోదాలో కూడా మర్రిశశిధర్ రెడ్డి పనిచేశారు. యూపీఏ హయంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించిన ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉంటూ వచ్చారు.
ఈ ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) హస్తం పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి శశిధర్ రెడ్డి రాజీనామాతో రెండో నష్టం. పేరున్న నేతలు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడారు. మునుగోడు(Munugode) సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రాజీనామా చేసి.. బీజేపీ(BJP)లోకి జంప్ చేయడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.