Kishan Reddy On TRS : టీఆర్ఎస్లో కొంతమంది బీజేపీ రావాలనుకుంటున్నారు
BJP Shamirpet Training Classes : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు. కమలంపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో బీజేపీ శిక్షణా తరగతులు(BJP Training Classes) మెుదలయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ తరగతులను ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటుగా పార్టీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ((Telangana)లో తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై మాట్లాడారు. మూడు రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. రానున్న రోజుల్లో పార్టీని ఎలా ముందుకెళ్లాలని తీసుకెళ్లానే విషయంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
చిన్న చిన్న అభిప్రాయాలు ఉండటం సహజమేనని.. కానీ అందరం కలిసి పని చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ బీజేపీ(BJP) అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్(TRS) పార్టీలో ఉన్న వాళ్లలో కొంతమంది.. బీజేపీ అధికారంలోకి రావాలనే కొరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పారదర్శకంగా కేంద్రం పనిచేస్తుందన్న కేంద్రమంత్రి.. ఓట్ల కోసం హిందూయిజాన్ని విమర్శిస్తున్నారన్నారు.
'తెలంగాణ(Telangana)లో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. చెప్పుకోడానికి ఏమీ లేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. 2023 ఎన్నికల్లో(2023 Elections) పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని విమర్శించి.. ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. వారు చేసిన పనులు చెప్పే పరిస్థితిలో లేరు. తెలంగాణలో 2023లో మార్పు వస్తుంది. ఎంత ఖర్చు పెట్టినా.. ఎన్ని దుర్వినియోగాలు చేసినా.. మార్పు రావడం కచ్చితం.' అని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
అధికారంలోకి రావాలంటే ఎప్పుడో వచ్చేవాళ్లమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అడ్డదారులు తొక్కి దేశంలో రాష్ట్రాలలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయన్నారు. బీజేపీ మాత్రం సిద్ధాంతాలను నమ్ముకొందన్నారు. దేశంలో అధికారంలోకి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ(Telangana)లోనూ అధికారంలోకి వస్తామన్నారు.
'ఒకప్పుడు రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయం. ఏకాత్మ మానవతావాదమే బీజేపీ(BJP) మూల సిద్ధాంతం. ఆలస్యమైనా మూల సిద్దాంతం ఆధారంగానే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలన్నదే మన పార్టీ లక్ష్యం.' అని బండి సంజయ్ అన్నారు.