తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!

Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!

Sharath Chitturi HT Telugu

27 April 2024, 11:10 IST

    • CWC report on water crisis : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభం ముందు నిలబడ్డాయని సెంట్రల్​ వాటర్​ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఆందోళనకర పరిస్థితులపై ఓ నివేదికను విడుదల చేసింది.
దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి!
దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి! (AFP)

దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి!

Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్​ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత సమస్య ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళలో.. నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో పడిపోయాయని.. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ సీడబ్ల్యూసీ చెప్పింది. ప్రస్తుతం రిజర్వాయర్ల కెపాసిటీలో సగటున 17శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది.

తెలంగాణ, ఆంధ్రలో తీవ్ర నీటి కొరత..

దక్షిణాది రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ మానిటర్​ చేస్తున్న 42 రిజర్వాయర్లలో టోటల్​ లైవ్​ స్టోరేజ్​ కెపాసిటీ 53.334 బిలియన్​ క్యూబిక్​ మీటర్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే (29శాతం).. నీటి నిల్వలు చాలా వరకు పడిపోయాయి. దశాబ్ద కాలం సగటు (23శాతం) చూసుకున్నా.. ఈసారి నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ లెక్కన చూసుకుంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం, మంచి నీటి సరఫరా, హైడ్రో ఎలక్ట్రిక్​ విద్యుత్​ ఉత్పత్తిపై నీటి సంక్షోభం ప్రభావం పడే అవకాశం ఉంది.

Andhra Pradesh water crisis : కానీ దేశం మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తూర్పు భారతంలో నీటి నిల్వల స్థాయిలు పెరుగుతున్నాయి. గతేడాదితో పాటు 10ఏళ్ల సగటు తీసుకున్నా.. అసోం, ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​లో నీటి నిల్వల స్థాయి మెరుగుపడుతోంది.

వాయువ్య రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. గుజరాత్​, మహారాష్ట్రలో సీడబ్ల్యూసీ మానిటర్​ చేస్తున్న 49 రిజర్వాయర్లలో 11.771 బీసీఎం నీటి నిల్వలు ఉన్నాయి. టోటల్​ కెపాసిటీలో ఇది 31.7శాతం. గతేడాది.. ఈ ఫిగర్​ ఇంకా ఎక్కువగా ఉండేది.

CWC report on water crisis : ఉత్తర, మధ్య భారతంలో కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. చారిత్రక సగటు కన్నా నీటి నిల్వలు పడిపోతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. బ్రహ్మపుత్ర, నర్మద, తపతి నదులపై ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణం కన్నా మెరుగ్గా ఉన్నాయి. కానీ కావేరీతో పాటు తూర్పువైపు ప్రయాణించే మహానది, పెన్నాలో నీటి కొరత తీవ్రత అత్యంత ఘోరంగా ఉంది.

ఎల్​ నీనో ప్రభావంతో గతేడాది వర్షాలు సరిగ్గా పడకపోవడం, నీటి వినియోగం విపరీతంగా పెరగడం వంటివి.. నీటి సంక్షోభానికి పలు కారణాలు. ఈ నేపథ్యంలో.. ఈసారి రుతుపవనాలపైనే అందరి చూపు ఉంటుంది. అందులోనూ.. ఈసారి సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.