Dubai rainfall: ఎడారి దేశాల్లో కుండపోత వానలు; వరద నీటిలో దుబాయ్; వాతావరణ మార్పులే కారణమా?-what caused unusual rainfall in desert city of dubai leading to floods ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dubai Rainfall: ఎడారి దేశాల్లో కుండపోత వానలు; వరద నీటిలో దుబాయ్; వాతావరణ మార్పులే కారణమా?

Dubai rainfall: ఎడారి దేశాల్లో కుండపోత వానలు; వరద నీటిలో దుబాయ్; వాతావరణ మార్పులే కారణమా?

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 01:50 PM IST

Dubai rainfall: ఎడారి దేశాల్లో కుండపోత వర్షాలు.. వర్షం కోసం ఎదురు చూసే నగరాల్లో ఏడాది పాటు కురిసే వర్షపాతం 24 గంటల్లోనే.. సోమ, మంగళవారాల్లో దుబాయి తదితర గల్ఫ్ నగరాల ప్రజలు చూసిన అసాధారణ పరిస్థితులు ఇవి. ఈ భారీ వర్షాలు, వరదలు వాతావరణ మార్పుల వల్లనే అని నిపుణులు చెబుతున్నారు.

దుబాయ్ లో వరద నీటిలో వాహనాలు
దుబాయ్ లో వరద నీటిలో వాహనాలు (Reuters)

మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఎడారి నగరమైన దుబాయ్ స్తంభించిపోయి ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో 25 నిమిషాల పాటు కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నీటితో మునిగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏడాదిన్నర వర్షపాతం 24 గంటల్లోనే..

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేకరించిన వాతావరణ డేటా ప్రకారం.. ఏడాదిన్నర కాలంలో కురిసేంత వర్షపాతం దుబాయ్ నగరంలో 24 గంటల్లోనే నమోదైందని తేలింది. సోమవారం రాత్రి ఈ వర్షం ప్రారంభమైంది. ఆ రోజు అర్థరాత్రి వరకు 20 మిల్లీమీటర్ల (0.79 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. దాంతో, దుబాయిలోని రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయానికి ఇది మరింత తీవ్రమైంది. ఆ రోజు చివరి నాటికి, మొత్తంగా 142 మిల్లీమీటర్ల (5.59 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. దాంతో, దుబాయ్ నగరం జలమయమైంది. రహదారులు వరద నీటిలో మునిగాయి. సాధారణంగా, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సగటున సంవత్సరానికి 94.7 మిల్లీమీటర్ల (3.73 అంగుళాలు) వర్షం కురుస్తుంది. అలాంటిది, ఇప్పుడు 24 గంటల వ్యవధిలోనే 142 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ప్రభుత్వ సహాయ చర్యలు

భారీ వర్షాలకు ముందు యూఏఈ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఉద్యోగులు రిమోట్ గా పని చేయాలని కోరింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ భారీ వర్షాలకు కారణం అరేబియా ద్వీపకల్పం గుండా ప్రయాణించి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీద ఏర్పడిన తుపాను అని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల యూఏఈ లోనే కాకుండా ఇతర గల్ఫ్ దేశాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఒమన్ లో వరదల కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

గ్లోబల్ వార్మింగ్ వల్లనే..

ఈ అకాల, అసాధారణ వర్షపాతానికి కారణం గ్లోబల్ వార్మింగేనని వాతావరణ మార్పుల నిపుణుడు ఫ్రైడెరిక్ ఒట్టో తెలిపారు. మానవుడు చేజేతులా ఈ ఉపద్రవాన్ని తెచ్చుకున్నారన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు మరిన్ని ఏర్పడే ప్రమాదముందని లండన్ లోని గ్రాంథమ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ కు చెందిన ఒట్టో తెలిపారు.

క్లౌడ్ సీడింగ్ కారణమా?

ఇదిలావుండగా, ఈ భారీ వర్షాలు పాక్షికంగా క్లౌడ్ సీడింగ్ వల్ల సంభవించాయని బ్లూమ్ బర్గ్ నివేదించింది. నీటి లభ్యత సమస్యలను పరిష్కరించడానికి యూఏఈ 2002 లో క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. మేఘాలపై పొటాషియం క్లోరైడ్ వంటి రసాయనాలను స్ప్రే చేసి, కృత్రిమంగా వర్షాలు కురిపించే మేఘ మథనం కార్యక్రమాన్ని చేపట్టింది. గత రెండు రోజుల్లో సీడింగ్ విమానాలు ఏడు క్లౌడ్ సీడింగ్ మిషన్లు నిర్వహించాయని స్పెషలిస్ట్ వాతావరణ నిపుణుడు అహ్మద్ హబీబ్ బ్లూమ్ బర్గ్ కు తెలిపారు.

దుబాయ్ లో వరద నీటిలో మునిగిన ప్రధాన రహదారి
దుబాయ్ లో వరద నీటిలో మునిగిన ప్రధాన రహదారి (AP)
IPL_Entry_Point