Hyderabad Cyber Crime : టెలిగ్రామ్ యాప్ లో పరిచయం, పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం-దర్యాప్తు దుబాయ్ వరకూ!-hyderabad crime news in telugu woman cheats high profit from investment ts police arrested three ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Crime News In Telugu Woman Cheats High Profit From Investment Ts Police Arrested Three

Hyderabad Cyber Crime : టెలిగ్రామ్ యాప్ లో పరిచయం, పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం-దర్యాప్తు దుబాయ్ వరకూ!

HT Telugu Desk HT Telugu
Feb 26, 2024 05:59 PM IST

Hyderabad Cyber Crime : ఇటీవల పెట్టుబడి పేరుతో ఓ మహిళ నుంచి రూ.50 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దుబాయ్ లో నుంచి ఓ వ్యక్తి స్థానికంగా ఇద్దరు వ్యక్తులతో ఈ దందా నడిపించినట్లు గుర్తించారు.

 పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం
పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం

Hyderabad Cyber Crime : సామాజిక మధ్యమల ద్వారా పెట్టుబడుల పేరుతో(Investment fraud) భారీ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్(Cyber crime) పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్ యాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు తాము సూచించిన యాప్ లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఆమెకు వాటికి సంబంధించిన లింకులు పంపి సదరు మహిళ నుంచి పలు దఫాలుగా రూ.49,45,900 లను కాజేసి ఆమెను మోసం చేశారు. దీంతో బాధిత మహిళా గతంలోనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో అకౌంట్ హోల్డర్స్ గా ఉన్న జానీ, ఇమాన్యుల్ అనే ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అనంతరం వారిని విచారించగా వారికి టెలిగ్రామ్ యాప్ (Telegram app)ద్వారా దుబాయ్(Dubai) కి చెందిన రసూల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని..... రసూల్ రోజు మూడు నుంచి నాలుగు యూఎస్ డాలర్లు పంపిస్తానని వాటిని ఇండియన్ కరెన్సీ లోకి మార్చి పంపాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రసూల్ సూచన మేరకు కాసెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతూ కాజేసిన నగదును వీరిద్దరూ రసూల్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఇందుకు గాను రసూల్ వారికి మూడు శాతం కమిషన్ గా ఇచ్చేవాడు. ఇదే తరహాలో నిందితులు భారీ మోసాలకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీరు దేశవ్యాప్తంగా 50 కేసుల్లో తమ ఖాతాలను వినియోగించుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, మూడు పెన్ డ్రైవ్లు, ఏడు బ్యాంకు పాస్ బుక్ లు, 33 చెక్ బుక్స్, 25 డెబిట్ కార్డులు, ఆఫీస్ స్టాంప్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పెట్టుబడుల పేరుతో రెండున్నర లక్షలు టోకరా

హైదరాబాద్ (Hyderabad)కు చెందిన వ్యక్తి వద్ద నుంచి పెట్టుబడుల పేరుతో మోసం చేసి రెండున్నర లక్షలు కాజేశాడు సైబర్ నేరగాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా....కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ముంబయికి నగరానికి చెందిన మహమ్మద్ సోహెబుల్లాఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను సైబర్ మోసగాళ్లతో కుమ్మకై వారికి బ్యాంక్ ఖాతాలను అందించేవాడు. ఇందుకు గాను అతను ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలు కమిషన్ గా తీసుకునేవాడు. రాష్ట్రంలో జరిగిన ఆరు కేసులతో పాటు దేశవ్యాప్తంగా 42 కేసుల్లో ఈ ఖాతాలు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 37 చెక్ బుక్కులు, 38 డెబిట్ కార్డులు, 11 పాస్ బుక్కులు, 15 నకిలీ రబ్బర్ స్టాంపులు, 12 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్ల, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

చెక్ మార్పింగ్ చేసి భారీగా నగదు స్వాహా

రుణం ఇప్పిస్తానని నమ్మించి దంపతుల నుంచి ఓ వ్యక్తి నగదు కాజేసిన సంఘటన మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......వెంగళరావు నగర్ కాలనీకి చెందిన నాగరాజు, శిరీష దంపతులు ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించే వ్యక్తుల కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేశారు. ఈ గ్రామంలో గత డిసెంబర్ లో ధనసింగ్ అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి తాను సుందరం ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నానని......రూ. 50 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పాడు. అయితే లోన్ ప్రాసెస్ లో భాగంగా కొంత నగదును చెల్లించాలని దన్ సింగ్ చెప్పగా ఒకసారి రూ. 13,200 మరోసారి రూ.5,900 ఫోన్ పే చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు తమకు ఎలాంటి లోన్ అవసరం లేదని...తమ డబ్బును తమకు ఇవ్వాలని దన్ సింగ్ ను కోరారు శిరీష దంపతులు. కాగా లోన్ ప్రాసెస్ మొదలైందని వద్దు అనుకొని మీ డబ్బు మీకు తిరిగి కావాలి అంటే రూ.5,900 లతో చెక్ పంపిస్తే డిపాజిట్ చేస్తానని వారిని నమ్మించాడు దన్ సింగ్. దీంతో శిరీష దన్ సింగ్ కు రూ.5,900 లతో చెక్ ఇచ్చింది. దన్ సింగ్ ఆ చెక్కును రూ.లక్ష 95 వేలుగా మార్చి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నాడు. అయితే తమ బ్యాంక్ అకౌంట్ లో నుంచి రూ.లక్ష 95 వేలు విత్ డ్రా అయినట్లు బాధితులకు మెసేజ్ రావడంతో దన్ సింగ్ కు కాల్ చేశారు. కొన్ని రోజులకు మీ డబ్బు మీకే ఇస్తానని అతడు చెప్పి తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. మోసపోయామని గ్రహించిన దంపతులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel

సంబంధిత కథనం